రైతు మృతితో అమరావతి రైతుల ఆగ్రహం

రైతు మృతితో అమరావతి రైతుల ఆగ్రహం
రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోతున్న రైతు దొండపాటి రామారావు మృతి నేపథ్యంలో ప్రభుత్వం, మంత్రుల తీరుపై అమరావతి రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. శుక్రవారం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ ఇళ్లు కోల్పోతున్న వారితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడిన అనంతరం కుర్చీలో కూర్చుంటూ రైతు రామారావు అక్కడికక్కడే గుండెపోటుతో మృతిచెందారు. 
 
తన అభిప్రాయం చెప్పిన వెంటనే అక్కడే సమావేశం ఏర్పాటు చేసిన ప్రతినిధులు రైతు చెప్పిన ప్రతిపాదన సాధ్యం కాదని సమాధానం ఇచ్చారని, దీంతో తన బావ ఆవేదనకు గురై చనిపోయారని రామారావు బావమరిది మంత్రులపై మండిపడ్డారు. శనివారం మధ్యాహ్నం తాడేపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుండి భౌతికకాయాన్ని మందడం తీసుకొచ్చారు. 
 
విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ పూలమాలవేసి నివాళి అర్పించేందుకు వెళ్లారు. ఆ సమయంలో మీ వల్లే మా బావ చనిపోయాడంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులను చంపడానికి వచ్చారా? అంటూ మండిపడ్డారు. అన్ని రోడ్లు ఉండగా ఇళ్లు పీకి రోడ్డెందుకు వేయాలంటూ కేకలు వేశారు. 
 
ఆయనకు పలువురు మహిళలు కూడా తోడయ్యారు. అయితే పలువురు వారికి సర్దిచెప్పారు. అనంతరం మంత్రి అక్కడ నుండి వెళ్లిపోయారు. అలాగే  మంత్రి నారాయణ కూడా పూలమాలవేసి నివాళులర్పించాక ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడుతో కుటుంబ సభ్యులను ఫోన్లో మాట్లాడించారు.
 
అధైర్యపడకండి అండగా ఉంటా కుటుంబ సభ్యులకు సిఎం హామీ మృతిచెందిన రైతు దొండపాటి రామారావు కుటుంబ సభ్యులతో సిఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. వారికి అవసరమైన సాయం అందించాలని మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌లకు సూచించారు.