కెనడాలో భారత మహిళలకు భరోసాగా ఓ కేంద్రం!

కెనడాలో భారత మహిళలకు భరోసాగా ఓ కేంద్రం!
విదేశాల్లో, ముఖ్యంగా భారతీయులపై వ్యతిరేకత క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కెనడాలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడం, ఎవరు, ఎందుకు అలా చేస్తున్నారో తెలియకపోవడం కలవరపెడుతోంది.  ఈ సందర్భంగా కెనడాలోని భారతీయ మహిళలకు భద్రత, భరోసా కల్పించే దిశగా టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ఒక గొప్ప అడుగు వేసింది. 
 
ఆపదలో ఉన్న భారతీయ మహిళలకు అండగా నిలిచేందుకు వన్‌ స్టాప్‌ సెంటర్‌ ఫర్‌ వుమెన్‌ (ఓఎస్‌సీడబ్ల్యూ)ను అధికారికంగా ప్రారంభించింది. కెనడాలో నివసిస్తున్న భారతీయ మహిళలు ఎదుర్కొనే గృహ హింస, కుటుంబ వివాదాలు, వేధింపులు, చట్టపరమైన సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ వన్ స్టాప్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.  ఇటీవల టొరంటోలో ఒక భారతీయ మహిళ హత్యకు గురైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సేవలను మరింత వేగవంతం చేసింది. 
ఈ కేంద్రం ద్వారా బాధిత మహిళలకు చాలా సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. మానసిక ఒత్తిడిలో ఉన్న మహిళలకు తక్షణమే కౌన్సిలింగ్ ఇస్తారు. అంతేకాకుండా వారికి నైతికంగా మద్దతు కూడా అందిస్తారు.  కెనడా స్థానిక చట్టాలకు లోబడి న్యాయ సలహాలు, సహాయం చేస్తారు. స్వచ్ఛంద సంస్థల (ఎన్జీఓల) సమన్వయంతో కెనడాలో ఉన్న భారతీయులకు సామాజిక మద్దతును కల్పిస్తారు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కెనడాలో అత్యంత అవసరమైన వారికి నియమిత పద్ధతిలో ఆర్థిక తోడ్పాటును అందిస్తారు. 
 
ఈ కేంద్రం పూర్తిగా ఒక మహిళా అడ్మినిస్ట్రేటర్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. దీనివల్ల బాధిత మహిళలు తమ సమస్యలను ఎలాంటి సంకోచం లేకుండా షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. అత్యవసర సమయాల్లో సంప్రదించడానికి 24 గంటలపాటు పనిచేసే హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ సెంటర్ సేవలు కేవలం భారతదేశ పాస్‌పోర్టు కలిగిన మహిళలకు మాత్రమే వర్తిస్తాయి.
కెనడాలో ఉన్న భారతీయ మహిళలు ఎవరైనా ఆపదలో ఉంటే ఫోన్, మెయిల్ ద్వారా టొరంటోలోని భారత కాన్సులేట్‌ను సంప్రదించవచ్చు. ఇందుకోసం +1 (437) 552 3309 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు.. ఈ-మెయిల్ ఐడీ osc.toronto@mea.gov.in ను కేటాయించారు. టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్‌ను నేరుగా సంప్రదించవచ్చు.