నాటి డ్రగ్స్ కేసులో ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయని పేర్కొంటూ అకున్ సభర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది? అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. నిందితుల వాంగ్మూలాలు, ఆడియో, వీడియోలు రికార్డు చేశారని, కుటుంబ సభ్యుల భవిష్యత్తు నాశనమౌతుందనే భయంతో కెసిఆర్ ప్రభుత్వం నాటి డ్రగ్స్ కేసును నీరు గార్చిందని ఆయన ఆరోపించారు.
అకున్ సభర్వాల్ ను డ్రగ్స్ కేసు విచారణ నుంచి తప్పించారని, అకున్ సేకరించిన ఆధారాలను నాటి సిఎస్ సోమేశ్ స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. అకున్ సభర్వాల్ సేకరించిన ఆధారాలు ఏమయ్యాయి? అని పేర్కొంటూ తక్షణమే సోమేశ్వర్ ను విచారించాలని సూచించారు. పండుగలు, నూతన సంవత్సరం వేడుకల సమయంలోనే డ్రగ్స్ కేసుల నమోదుకు పరిమితం అవుతున్నారే తప్ప రాష్ట్ర పభుత్వం సీరియస్ గా వ్యవహరించడం లేదని సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా డ్రగ్స్ నిర్మూలనపై చిత్తశుద్ది ఉంటే సీఎం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ‘‘ఈగల్’’ టీం వెంటనే రంగంలోకి దిగి సోమేశ్ కుమార్ ను విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈగల్ టీంకు నిజంగా లీగల్ గా అధికారాలున్నాయా? అని ప్రశ్నించారు. ఈగల్ టీంలో సమర్ధులైన అధికారులు ఉన్నప్పటికీ, ఒకరిద్దరు అధికారులు మాత్రం డబ్బులకు అమ్ముడుపోయి డ్రగ్ పెడ్లర్లతో రాజీపడుతున్నారని ఆరోపించారు. నిన్నటి ఈగల్ టీం దాడిలో పెడ్లర్ల నుండి డ్రగ్స్ కొనుగోలు చేసిన ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరుగుతున్న డ్రగ్స్ విక్రయాలపై ఉక్కుపాదం మోపాలంటే అకున్ సబర్వాల్ వంటి సమర్ధులైన అధికారులకు తిరిగి ‘డ్రగ్స్ కేసు’ విచారణ బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు. అట్లా కాకుండా డ్రగ్స్ కేసు విచారణ తేల్చకుండా తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసినంత మాత్రాన రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన సాధ్యం కానేకాదని స్పష్టం చేశారు.

More Stories
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చార్జిషీట్
హిందూ కార్యకర్తలు ఏదేశంలోనైనా ధర్మానికి అనువుగా జీవించాలి
వీర్ బాల్ దివస్ సందర్భంగా సిఖ్ త్యాగాలకు నివాళులు!