తైవాన్ కు అమెరికా ఆయుధాల అమ్మకంపై చైనా హెచ్చరిక

తైవాన్ కు అమెరికా ఆయుధాల అమ్మకంపై చైనా హెచ్చరిక

తైవాన్‌కు ఆయుధాలను విక్రయించాలని అమెరికా తీసుకున్న నిర్ణయంపై చైనా మండిపడింది. తైవాన్ కు ఆయుధాలను విక్రయిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు, తైవాన్ కు గత కొన్నేళ్లుగా ఆయుధాల సరఫరాలో పాల్గొన్న 20 రక్షణ కంపెనీలు, 10 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ లపై చైనా విదేశాంగ శాఖ ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రకటించింది.

అమెరికా తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం అంటే ‘వన్-చైనా సిద్ధాంతం’తో పాటు చైనా-అమెరికా సంయుక్త ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరించడమే అని బీజింగ్ ఆరోపించింది. ఈ చర్యలు చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యమేనని, దేశ సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను దెబ్బతీస్తున్నాయని వెల్లడించింది.  చైనా ఆంక్షలు విధించిన కంపెనీల జాబితాలో నార్త్‌రోప్ గ్రుమ్మన్, బోయింగ్ (సెయింట్ లూయిస్), ఎల్3 హారిస్ మ్యారిటైమ్ సర్వీసెస్, గిబ్స్ అండ్ కాక్స్, రెడ్ క్యాట్ హోల్డింగ్స్, టీల్ డ్రోన్స్ వంటి 20 దిగ్గజ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. చైనాలో ఈ కంపెనీలకు ఉన్న స్థిర, చరాస్తులన్నింటినీ స్తంభింపజేస్తున్నట్లు ప్రకటించింది. 

అలాగే, చైనా వ్యక్తులు లేదా సంస్థలు ఈ కంపెనీలతో ఎలాంటి వ్యాపార ఒప్పందాలు చేసుకోకూడదని నిషేధించింది. తైవాన్కు ఆయుధాల సరఫరాలో కీలకంగా వ్యవహరించిన ఆండూరిల్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు పామర్ లక్కీతో సహా 10 మంది ఎగ్జిక్యూటివ్ ల విషయంలో కూడా బీజింగ్ కీలక వాఖ్యలు  చేసింది. వీరు చైనాలోకి ప్రవేశించడంపై పరిమితులు విధించడమే కాకుండా, చైనాలో ఉన్న వీరి ఆస్తులపై ఆంక్షలు విధించింది.

తైవాన్ అంశం చైనా జాతీయ ప్రయోజనాల్లో అత్యంత కీలకమైనదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. తైవాన్ విషయాన్ని అమెరికా-చైనా సంబంధాల మధ్య ఒక ‘రెడ్ లైన్’గా అభివర్ణించారు. రెడ్ లైన్ దాటొద్దని హెచ్చరించింది. తైవాన్‌కు ఆయుధాలు విక్రయించే ఏ కంపెనీ అయినా, వ్యక్తి అయినా తమ తప్పుడు నిర్ణయానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేసింది. చైనా సార్వభౌమాధికారాన్ని తక్కువ అంచనా వేయవద్దని చెప్పింది.

గతవారం తైవాన్‌కు భారీ ఆయుధాల విక్రయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రకారం, ఈ ప్రతిపాదిత ఆయుధ విక్రయాల విలువ 10 బిలియన్ డాలర్ల(సుమారు రూ.84,000 కోట్లు)ఉంటుంది. తైవాన్కు విక్రయించే వాటిలో మధ్యశ్రేణి క్షిపణులు, హౌవిట్జర్ ఫిరంగులు, అత్యాధునిక డ్రోన్లు, హిమార్స్‌ రాకెట్ వ్యవస్థలు, యాంటీ-ఆర్మడ్ డ్రోన్లు వంటి ఎనిమిది ఆయుధ ప్యాకేజీలు ఉన్నాయి.