2024 డిసెంబర్లో ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హైదరాబాద్ పోలీసులు కీలక అడుగు వేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా (ఏ-11) పేర్కొంటూ చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో దాదాపు 100 పేజీల సమగ్ర చార్జిషీట్‌ను దాఖలు చేశారు.
ఈ చార్జిషీట్లో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.
ఇందులో సంధ్య థియేటర్ యాజమాన్యం ప్రధాన నిందితులుగా (ఏ-1) ఉండగా, అల్లు అర్జున్‌తో పాటు ఆయన వ్యక్తిగత మేనేజర్, సిబ్బంది మరియు 8 మంది బౌన్సర్ల పేర్లు కూడా ఉన్నాయి. సినిమా ప్రీమియర్ సందర్భంగా వేలాది మంది అభిమానులు తరలివస్తారని తెలిసినప్పటికీ సరైన ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీస భద్రతా ఏర్పాట్లు లేకుండా థియేటర్‌కు రావడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని పోలీసులు తమ నివేదికలో స్పష్టం చేశారు.
అలాగే జనాలను నియంత్రించడంలో విఫలం కావడం, అజాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ఒక మహిళ మరణానికి, ఆమె కుమారుడి తీవ్ర గాయాలకు కారణమయ్యారనే ఆరోపణలను చార్జిషీట్లో పేర్కొన్నారు. 2024 డిసెంబర్ 4న జరిగిన ఈ తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు.
“గత సంవత్సరం సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తొక్కిసలాటపై ఈ నెల 24న ఛార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో సమర్పించాం. మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. ఏ-1గా సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-11 గా అల్లు అర్జున్, ఆయన మేనేజర్, సిబ్బంది సహా 8 మంది బౌన్సర్లపై అభియోగాలు దాఖలు చేశాం. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్థారించాం” అని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ తెలిపారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ కేసులో బెయిల్‌పై ఉన్నారు. బాధితులకు అండగా ఉండటానికి ఇప్పటికే సుమారు రూ.2 కోట్లను అల్లు అర్జున్, పుష్ప చిత్ర బృందం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు సమాచారం. అయితే, చార్జిషీట్ దాఖలు కావడంతో ఇప్పుడు ఈ కేసు తదుపరి న్యాయ విచారణకు సిద్ధమైంది.

More Stories
ఈగల్ బృందంలో కొందరు డ్రగ్స్ పెడ్లర్లతో రాజీ
హిందూ కార్యకర్తలు ఏదేశంలోనైనా ధర్మానికి అనువుగా జీవించాలి
వీర్ బాల్ దివస్ సందర్భంగా సిఖ్ త్యాగాలకు నివాళులు!