2025లో ఎన్నో విజయాలు సాధించిన భారత్

2025లో ఎన్నో విజయాలు సాధించిన భారత్

భారత్‌ 2025లో ఎన్నో విజయాలు సాధించిందని ప్రధాని నరేంద్రమోదీ గుర్తుచేసుకున్నారు. ‘మన్‌కీ బాత్‌’ 129వ ఎసిపోడ్‌లో ప్రధాని ప్రసంగిస్తూ  ఆపరేషన్ సిందూర్‌ను మారుతున్న భారతావనిగా అభివర్ణించి, సైనిక విజయాన్ని దేశవ్యాప్త దేశభక్తిని పెంచిన ఘటనగా ప్రధాని ప్రశంసించారు. వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు కూడా దేశ ప్రజల్లో ఇదే స్ఫూర్తి కనిపించిందని ప్రధాని చెప్పారు.

క్రీడలపరంగా కూడా ఈ ఏడాది చిరస్మరణీయమని పేర్కొంటూ12 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుందని, మహిళల క్రికెట్ జట్టు మొదటిసారి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుందని తెలిపారు.  మహిళల అంధుల జట్టు టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. అంతరిక్ష రంగంలోనూ ఈ ఏడాది భారత్‌ తన ప్రతిభను చాటుకుందని చెబుతూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లాను ఆయన ప్రశంసించారు.

ఈ ఏడాది భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చూపిన ధైర్యం, స్వదేశీ ఆయుధాలు, టెక్నాలజీ ఉపయోగం ద్వారా సాధించిన విజయాలను మోదీ ప్రశంసించారు.  అంతేకాకుండా, గిర్ అడవుల్లో ఆసియాటిక్ సింహాల సంఖ్య పెరుగుదల, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, మహిళా సాధికారత వంటి అంశాలను కూడా ప్రధాని ప్రస్తావించారు.  వోకల్ ఫర్ లోకల్‌ను మరింత బలోపేతం చేయాలని, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు.

యువశక్తే భారత ప్రధాన బలమని స్టార్టప్‌, అగ్రికల్చర్‌, ఫిట్‌నెస్ అంశాల్లో యువత ఆవిష్కరణలు బాగున్నాయని ప్రధాని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సరికొత్త టెక్నాలజీ, ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలని మోదీ సూచించారు. కోట్ల మంది పాల్గొన్న మహా కుంభమేళాను దిగ్విజయంగా నిర్వహించి భారత్‌ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచిందని మోదీ పేర్కొన్నారు. అయోధ్య రామాలయంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం ప్రతి హిందువు గర్వపడేలా చేసిందని చెప్పారు.

ఈ ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను గుర్తుచేశారు. 2025లో దేశ ప్రజలు ఏ విధంగా ఐక్యతతో సామరస్యంగా ఉన్నారో అదేవిధంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణలోనూ మనం ముందున్నామని ప్రధాని తెలిపారు.

“దేశంలో చీతాల సంఖ్య 2025 నాటికి 30కి పైగా పెరగడం సంతోషకరమైన విషయం. ఈ ఏడాది కొన్ని చోట్ల ప్రకృతి వైపరీత్యాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా మనం ధైర్యంగా నిలబడ్డాం. 2025 మనకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇప్పుడు నూతన సంకల్పం, కొత్త లక్ష్యాలతో 2026లోకి అడుగుపెడుతున్నాం” అని ప్రధాని మోదీ అన్నారు.