పరకామణి కేసులో సుప్రీం తీర్పు ప్రకారం ప్రత్యేక ఎఫ్​ఐఆర్​

పరకామణి కేసులో సుప్రీం తీర్పు ప్రకారం ప్రత్యేక ఎఫ్​ఐఆర్​
తిరుమల తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి పాల్పడిన కేసులోవిభిన్న అంశాలు ఉన్నందున సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే ఈ అంశాన్ని పరిశీలించాలని సీఐడీకి ఏపీ హైకోర్టు సూచించింది సూచించారు.  నిందితుడు రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు ఆస్తులను ఎవరెవరికి రిజిస్ట్రేషన్‌ చేశారనే వివరాలతో మధ్యంతర నివేదికను హైకోర్టుకు ఏసీబీ డీజీ సీల్డ్‌కవర్లో సమర్పించారు. 
 
న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ దాన్ని పరిశీలించి తగిన ఉత్తర్వులిస్తామని ప్రకటించారు. పరకామణిలో చోరీ కేసు రాజీ ఘటనపై ఇప్పటికే చాలావరకు దర్యాప్తు పూర్తయిందని, కొన్ని అంశాల్లోనే దర్యాప్తు మిగిలి ఉందని గుర్తు చేశారు. కేసును జనవరి 5కు వాయిదా వేశారు.  పరకామణిలో జరిగిన అక్రమాలు, చోరీ కేసును లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై సీఐడీ విచారణకు ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నిందితుడు రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు ఆస్తులను ఎవరెవరికి రాశారో ఆ వివరాలతో నివేదిక ఇవ్వాలని ఏసీబీ డీజీని ఆదేశించింది. 
శుక్రవారం జరిగిన విచారణలో కోర్టు ఆదేశాల మేరకు నివేదిక సమర్పించినట్లు ఏసీబీ డీజీ తరఫున న్యాయవాది శీతిరాజు శ్యామ్‌సుందర్‌రావు తెలిపారు. సీఐడీ తరఫున అదనపు పీపీ పాణిని సోమయాజి స్పందిస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
టీటీడీ పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కంటే పెద్దదని గతంలోనే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని సంబంధిత అధికారుల్ని సూచించింది. బాధ్యతా రాహిత్యంతోనే పరకామణి చోరీ ఘటన జరిగిందన్న హైకోర్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి బాధ్యత ఉండదని అభిప్రాయం వ్యక్తం చేసింది. టీటీడీలో ఔట్‌సోర్సింగ్‌ నియామకాలు సరికాదన్న న్యాయస్థానం విరాళాల లెక్కింపు వద్ద టేబుళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 
 
విరాళాల లెక్కింపు కోసం భక్తులను ఎందుకు తీసుకోకూడదని న్యాయస్థానం ప్రశ్నించిన విషయం విదితమే. టీటీడీ నిర్వహణలో ఏఐని ఉపయోగించాలని హైకోర్టు ఇంతకుముందే సూచించింది. హుండీ కానుకల లెక్కింపు కేంద్రం పరకామణిలో దొంగతనం కేసు విచారణలో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు, సూచనలు చేసింది. విరాళాల లెక్కింపులో అవకతకవలు అత్యంత తీవ్రమైనవిగా పేర్కొంది. ఇది కోట్ల మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా అభిప్రాయపడిందని వ్యాఖ్యానించింది. పరకామణిలో జరిగిన నేరం దొంగతనం కంటే మించిందనే భావనను వ్యక్తం చేసింది. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలను ఎంత మాత్రం ఉపేక్షించలేమని స్పష్టం చేసింది.