బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రవేశాలకు దారి తీస్తున్నాయి. ఈ ఘటనలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. బీజేపీ శ్రేణులు బంగాల్లోని సిలిగురిలో కాగడాల ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేత అనితా మహతో మాట్లాడుతూ, “హిందువులు ఏకమవకపోతే ఇలాంటి హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉంటాయి. బంగ్లాదేశ్‌లో సనాతన హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు బాధాకరమైనవి. మతం కోసం కూడా మనం జీవనాధారాల కోసం పోరాడినట్లే పోరాడాల్సిన అవసరం ఉంది” అని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్‌లో ఇటీవల ఇద్దరు హిందువులు మూక దాడి, హత్యకు గురికావడం భారత రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంగాల్‌తో పాటు అసోం రాష్ట్రాల్లోనూ ఆందోళనలు జరిగాయి. కోల్‌కతా వీధుల్లో శుక్రవారం పెద్ద సంఖ్యలో నిరసనకారులు, ముఖ్యంగా కాషాయ దుస్తులు ధరించిన హిందూ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. మైనారిటీలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు.
మరోవైపు, బీజేపీ నేత షాజియా ఇల్మీ కూడా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసను తీవ్రంగా ఖండించారు. “అతివాదులు హిందువులను హత్యలు చేయడం, లించింగ్‌కు పాల్పడటం తాత్కాలిక ప్రభుత్వ నాయకత్వం కళ్లముందే లేదా వారి ప్రోత్సాహంతోనే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇది అత్యంత దురదృష్టకరం. ఏ నాగరిక సమాజంలోనూ ఇది ఆమోదయోగ్యం కాదు” అని ఆమె తేల్చి చెప్పారు.
బంగ్లాదేశ్‌లోని మైనారిటీల రక్షణ అక్కడి ప్రభుత్వ బాధ్యతేనని, ఈ విషయంలో మానవ హక్కుల సంస్థలు, ప్రతిపక్షాలు ఎంపిక చేసిన విధంగా స్పందించకూడదని ఆమె సూచించారు. కాంగ్రెస్ ఎంపీ అఖిలేశ్ ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ, “బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతను నిర్ధరించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిదే. ఈ సమస్యను సంభాషణల ద్వారా పరిష్కరించాలి. విదేశాంగ మంత్రి, ప్రధాని మోదీ వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాలి” అని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ మాట్లాడుతూ, “ప్రపంచంలోని అన్ని నాగరిక దేశాలు బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసను ఖండిస్తున్నాయి. ఈ అంశంపై మన హైకమిషన్లు, రాయబార కార్యాలయాల ద్వారా అంతర్జాతీయంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి” అని కోరారు. బంగ్లాదేశ్‌లోని జరుగుతున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తోంది. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను కోరుతోంది.

More Stories
రాహుల్ సభ్యత్వం రద్దు చేయాలని బిజెపి ఎంపీ తీర్మానం
114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం
ఐపీఎల్ 2026కు ఎన్నికల సెగ