హిందూ కార్యకర్తలు ఏదేశంలోనైనా ధర్మానికి అనువుగా జీవించాలి

హిందూ కార్యకర్తలు ఏదేశంలోనైనా ధర్మానికి అనువుగా జీవించాలి
హెచ్ఎస్ఎస్, ఇతర హిందూ సంస్థల కార్యకర్తలు తాము నివసించే దేశంతో సంబంధం లేకుండా ధర్మానికి అనుగుణంగా జీవించాలని, పని చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, శ్రేయస్సును తీసుకువచ్చే సామర్థ్యం ధర్మానికి ఉందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన శ్రీ విశ్వ నికేతన్ ట్రస్ట్, భాగ్యనగర్ (హైదరాబాద్) సమీపంలోని కన్హా శాంతి వనంలో  ఐదు రోజులపాటు నిర్వహిస్తున్న 7వ విశ్వ సంఘ్ ఈ ప్రపంచ స్థాయి సమ్మేళనానికి అన్ని ఖండాలలోని 79 దేశాల నుండి 1,610 మంది కార్యకర్తలు, స్వయంసేవకులు, ప్రతినిధులు హాజరయ్యారు.
 
ఈ సమ్మేళనంలో శిబిర నేపథ్యాన్ని నొక్కి చెబుతూ, “ధర్మ దృష్టి, సంఘ లక్ష్యం విడదీయలేనివి. సమాజ సేవ, ప్రకృతి పట్ల శ్రద్ధ అనేవి శాఖ నుండి వెలువడే ప్రధాన సందేశాలు” అని ఆయన తెలిపారు. “హిందువులు కేవలం జ్ఞానం, తత్వశాస్త్రం, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం ద్వారానే తప్ప తమ ప్రభావాన్ని ఎప్పుడూ బలప్రయోగంతో విస్తరించలేదు. ప్రకృతితో, సమాజంతో సామరస్యపూర్వక సహజీవనం ద్వారానే వారు విస్తరించారు” అని ఆయన గుర్తు చేశారు. 
 
అయోధ్యలోని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ కోశాధికారి స్వామి గోవింద దేవగిరి ప్రారంభ సమావేశానికి ఆశీస్సులు అందిస్తూ “ధర్మే సర్వం ప్రతిష్ఠితం” అనే భావనను వివరించారు. ధర్మం జీవితంలో సమతుల్యతను, స్థిరత్వాన్ని ఇస్తుందని తెలిపారు. “ధర్మం లేకుండా శాంతి గానీ, అభివృద్ధి గానీ ఉండవు. ధర్మం విశ్వ సూత్రాల ద్వారా మానవాళికి మార్గనిర్దేశం చేస్తూ అభ్యుదయం (భౌతిక శ్రేయస్సు), నిశ్రేయస్సు (అంతరంగ పరిపూర్ణత) రెండింటినీ నిర్ధారిస్తుంది” అని ఆయన వివరించారు.

శ్రీ విశ్వ నికేతన్ తరపున స్వాగతం పలికిన  శ్యామ్ పరాండే మాట్లాడుతూ ప్రతి ఐదేళ్లకు ఒకసారి ముఖ్య కార్యకర్తలు ఒకచోట చేరి, పరస్పరం అనుసంధానమై తమ అనుభవాలను పంచుకుంటూ, సామూహిక సంకల్పాన్ని బలోపేతం చేసుకునే ఒక విశిష్టమైన వేదిక ఈ విశ్వ సంఘ్ శిబిరం అని పేర్కొన్నారు. “ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, మన ఉమ్మడి లక్ష్యాన్ని, నిబద్ధతను పునరుద్ఘాటించే ఒక ఆనందదాయకమైన సమ్మేళనం” అని చెప్పారు.

హార్ట్‌ఫుల్‌నెస్ మూవ్‌మెంట్ అంతర్జాతీయ ఆధ్యాత్మిక మార్గదర్శి దాజీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. భారతీయ విద్యాభవన్ అధ్యక్షులు, అస్సాం, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల మాజీ గవర్నర్ గౌరవనీయ బన్వరీలాల్ పురోహిత్  శిబిరాధికారిగా అధ్యక్షత వహించారు. హిందూ స్వయంసేవక్ సంఘ్ (హెచ్ఎస్ఎస్) అంతర్జాతీయ సమన్వయకర్త  సౌమిత్ర గోఖలే స్వాగతం పలుకుతూ ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని ఆచరించడానికి, విస్తరించడానికి అంకితమైన కార్యకర్తల కుటుంబాల కలయికే ఈ శిబిరం అని తెలిపారు. శిబిర కార్యవాహ డాక్టర్ సిద్ధేష్ షెవాడే వేదికపై ఉన్న ప్రముఖులను పరిచయం చేశారు.

శిబిర నేపథ్యమైన “ధర్మే సర్వం ప్రతిష్ఠితం” పై రూపొందించిన ఒక ప్రత్యేక స్మరణికను స్వామి గోవింద దేవగిరి ఆవిష్కరించారు. ఇందులో మన జీవితంలోని వివిధ రంగాలలో సమకాలీన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధర్మాచరణను గురించి వివరించే వ్యాసాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత డాక్టర్ రతన్ శారదా రచించిన నాలుగు పుస్తకాలను కూడా విడుదల చేశారు. ఇవి, వివిధ దేశాల్లో హిందూ సంఘటనా కార్య చరిత్రను విస్తృత పరిశోధనలు, ఇంటర్వ్యూల ద్వారా నమోదు చేసినవి. 

వీటికి అదనంగా, దాజీ రచించిన “ది హార్ట్ ఆఫ్ లార్డ్ రామ్”, “హోలీ తీర్థంకరాస్” అనే రెండు కొత్త పుస్తకాలను  దత్తాత్రేయ హోసబళే ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎస్ఎస్ కార్యక్రమాలలో ఆలపించే ‘విశ్వ ప్రార్థన’కు ప్రసిద్ధ సంగీత దర్శకుడు రాహుల్ రణదే బాణీలు సమకూర్చగా, శంకర్ మహదేవన్ ఆలపించిన ప్రత్యేక వెర్షన్‌ను విడుదల చేశారు. ఫిల్‌హార్మోనిక్ ఆర్కెస్ట్రా నేపథ్యంతో ఈ రికార్డింగ్ ఆధారంగా రూపొందించిన ఒక థీమ్ వీడియోను కూడా ప్రదర్శించారు.