జపాన్ నుంచి నేతాజీ చితాభస్మాన్ని తీసుకురండి

జపాన్ నుంచి నేతాజీ చితాభస్మాన్ని తీసుకురండి

జపాన్‌లోని టోక్యోలో ఉన్న చారిత్రక బౌద్ధ ఆలయం రెంకో-జిలో ఉన్న నేతాజీ చితాభస్మాన్ని భారత్‌కు త్వరితగతిన తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబీకులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. 2026 సంవత్సరం జనవరి 23న జరగనున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిలోగా చితాభస్మాన్ని మాతృభూమి భారత్‌కు తీసుకురావాలని వారు విన్నవించారు. 

రాష్ట్రపతికి తాను రాసిన లేఖ వివరాలను వెల్లడిస్తూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి ఇన్ని దశాబ్దాలు గడిచిపోయినా, నేటికీ నేతాజీ చితాభస్మం విదేశీ గడ్డపైనే ఉండటం విచారకరమని ఆయన తెలిపారు.

“మా కుటుంబం డిసెంబరు 24న రాష్ట్రపతి ముర్ముకు ఒక లేఖను సమర్పించింది. జపాన్‌లోని రెంకోజీ నుంచి నేతాజీ చితాభస్మాన్ని భారత్‌కు తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్రపతిని కోరాం. నేతాజీ చితాభస్మం భారత గడ్డపైనే ఉండాలి అనేది ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్‌ఏ), నేతాజీ కుటుంబీకుల ప్రగాఢమైన సెంటిమెంట్ అని చెప్పాం” అని తెలిపారు. 

“మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచిపోయినా, నేతాజీ చితాభస్మం విదేశంలోనే ఉండిపోయిందని తలచుకుంటే బాధగా ఉందని వివరించాం. వచ్చే సంవత్సరం జనవరి 23న సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని మనం జరుపుకోబోతున్నాం. వీలైతే అప్పటిలోగా నేతాజీ చితాభస్మాన్ని భారత్‌కు తీసుకొచ్చే దిశగా సహకారాన్ని అందించాలని రాష్ట్రపతికి విన్నవించాం” అని వీడియో సందేశంలో ఆయన వివరించారు.

“శరత్ చంద్ర బోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ల కుటుంబంలోని సభ్యుడిగా నేను ఈ లేఖను రాస్తున్నాను” అని తన లేఖను చంద్రకుమార్ బోస్ మొదలుపెట్టారు. భారత్‌లోని ప్రస్తుత తరానికి, భావితరాలకు నేతాజీ చితాభస్మాన్ని స్వదేశంలోనే చూసుకునే అవకాశం దక్కాలని ఆయన ఆకాంక్షించారు.

నేతాజీకి చెందిన ఆజాద్ హింద్ సారథ్యంలో సింగపూర్ వేదికగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై 2025 అక్టోబరు 21 నాటికి 80 ఏళ్లు పూర్తయ్యాయని గుర్తుచేశారు. చలో దిల్లీ అంటూ నేతాజీకి చెందిన ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్‌ఏ) బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై భీకరదాడి చేసిందని, వారి త్యాగాలను గుర్తుచేసేలా, గౌరవించేలా దేశ రాజధాని డిల్లీలో ఐఎన్ఏ స్మారకాన్ని నిర్మించాలని ఆయన కోరారు.