సిరియా మసీదులో బాంబు పేలుడులో 8 మంది మృతి

సిరియా మసీదులో బాంబు పేలుడులో 8 మంది మృతి
సిరియాలో శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో బాంబు పేలింది. ఈ సంఘటనలో 8 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. ఈ బాంబు పేలుడుకు ఉగ్రవాదులు కారణమని ఆ దేశ మంత్రి ఆరోపించారు. సిరియాలోని హోమ్స్ నగరంలో ఈ సంఘటన జరిగింది. మైనారిటీ కమ్యూనిటీ ప్రాంతమైన అలవైట్‌లోని వాడి అల్-దహాబ్ పరిసరాల్లోని మసీదులో బాంబు పేలింది.
 
దేశంలో ఇస్లామిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన తరుణంలో, అల్పసంఖ్యాక వర్గాలే లక్ష్యంగా జరుగుతున్న వరుస దాడులు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. హోమ్స్ నగరంలోని వాడి అల్-దహబ్ ప్రాంతంలో ఉన్న ఇమామ్ అలీ బిన్ అబీ తాలిబ్ మసీదులో ఈ పేలుడు సంభవించింది. ఇది ప్రధానంగా అలవైట్ సామాజిక వర్గానికి చెందిన వారు ప్రార్థనలు చేసుకునే ప్రాంతం.
 
ప్రాథమిక సమాచారం ప్రకారం ఎనిమిది మంది మరణించగా, 18 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.మసీదు లోపల అమర్చిన పేలుడు పదార్థాల వల్లే ఈ ఘోరం జరిగిందని భద్రతా దళాలు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించాయి. సిరియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని “ఉగ్రవాద దాడి”గా అభివర్ణించింది. నిందితులను పట్టుకునేందుకు మసీదు చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి ఆధారాలు సేకరిస్తున్నారు.
 
2024లో బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుండి సిరియాలో మతపరమైన హింస పెచ్చుమీరుతోంది. అస్సాద్‌కు చెందిన అలవైట్ వర్గంపై దాడులు పెరిగాయి.గతేడాది మార్చిలో జరిగిన అలవైట్ పౌరుల మారణకాండలో దాదాపు 1,400 నుండి 1,700 మంది ప్రాణాలు కోల్పోయారు. జూలైలో స్వేయిడా ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో 2,000 మందికి పైగా మరణించారు. ఇందులో 789 మందిని రక్షణ, అంతర్గత మంత్రిత్వ శాఖ సిబ్బంది ఉరితీశారని నివేదికలు చెబుతున్నాయి.
 
జూన్ నెలలో డమాస్కస్‌లోని ఒక చర్చిలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 25 మంది చనిపోయారు. నగరంలో సున్నీ ముస్లింలు మెజారిటీ అయినప్పటికీ, అక్కడ అనేక అలవైట్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. కొత్త ఇస్లామిస్ట్ ప్రభుత్వం అందరినీ రక్షిస్తామని హామీలు ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని బాధితులు వాపోతున్నారు. 
హోమ్స్ నివాసి ఒకరు మాట్లాడుతూ, “పేలుడు తర్వాత అంతా గందరగోళంగా ఉంది. భయంతో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు” అని తెలిపారు. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా దేశాన్ని ఏకం చేస్తామని చెబుతున్నప్పటికీ, అంతర్గత భద్రతను కాపాడటం ఆయనకు పెద్ద సవాలుగా మారింది.