రుషికొండపై స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించరే?

రుషికొండపై స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించరే?
రుషికొండలో నిర్మితమైన భవనాల వినియోగంపై చంద్ర‌బాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా మంత్రుల కమిటీ నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. రుషికొండ భవనాల వినియోగంపై స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల అభిప్రాయాలను తీసుకోకుండా ముందుకు వెళ్లడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విష్ణుకుమార్ రాజు విమర్శించారు.
తమ అభిప్రాయం అడగకుండానే మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. ముందుగా ప్రజాభిప్రాయం తీసుకుని, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రుషికొండను కేవలం ఆదాయ వనరుల కోణంలో మాత్రమే చూస్తే భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
విశాఖపట్నం అంటే కేవలం సాగరతీరం మాత్రమే కాదని, ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. రుషికొండను తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా అభివృద్ధి చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. హోటళ్లకు కేటాయించడం ద్వారా రుషికొండను సామాన్య ప్రజల నుంచి దూరం చేసే పరిస్థితి ఏర్పడుతుందని విష్ణుకుమార్ రాజు విమర్శించారు.
స్టార్ హోటళ్లకు వెళ్లి భోజనం చేస్తే సామాన్యుల జేబులు ఖాళీ అవుతాయని వ్యాఖ్యానించారు. అందుకే రుషికొండ భవనాల వినియోగంపై ప్రజలకు మేలు చేసేలా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని ఆయన సూచించారు.  రుషికొండ అంశంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సమగ్ర నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.