* అమరావతిలో అటల్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి మాజీ ప్రధాని వాజ్‌పేయీ తీవ్రంగా కృషి చేశారని, ఆయన చూపిన మార్గం సుపరిపాలన అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. దేశం మెచ్చే నాయకుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో వాజ్‌పేయీ నిలిచిపోయారని ప్రశంసించారు. వాజ్ పేయ్ 101వ జయంతి సందర్భంగా అమరావతిలోని వెంకటపాలెంలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో కలిసి చంద్రబాబు ఆవిష్కరించారు.
విగ్రహం వద్ద చంద్రబాబు, శివరాజ్‌సింగ్ చౌహాన్ మొక్కలు నాటారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను పరిశీలించారు. అనంతరం నేతలు వాజ్‌పేయీ ప్రస్థానంపై ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్, సత్యకుమార్ వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన సుపరిపాలన సభలో చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయాల్లో అజేయమైన అధ్యాయం అటల్ బిహారీ వాజ్‌పేయీ అని తెలిపారు. రాజనీతిజ్ఞుడిగా అరుదైన గౌరవం, కవిగా హృదయానికి చేరువయ్యే భావప్రకటనలు, సమ్మతి నిర్మాణంలో అపూర్వ నైపుణ్యం అటల్ జీ ప్రత్యేకతలుగా పేర్కొన్నారు. దేశ భద్రతను బలోపేతం చేసి, పాలనకు కొత్త దిశ చూపిన మహానేత అని చెబుతూ అయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కడం అదృష్టమని చంద్రబాబు తెలిపారు.
“ప్రజా రాజధాని అమరావతిలో వాజ్‌పేయీ విగ్రహాన్ని ఆవిష్కరించాం. భారతదేశం గర్వించే నాయకుడు, అరుదైన నేత వాజ్‌పేయీ. ఈనెల 11 నుంచి అటల్-మోదీ సుపరిపాలన యాత్ర ప్రారంభించారు. 26 జిల్లా కేంద్రాల్లో వాజ్‌పేయీ విగ్రహాలు పెట్టాలని కోరారు. అందరూ కలిసి పనిచేసి ఒక చరిత్ర సృష్టించారు” అంటూ అభినందించారు. వాజ్‌పేయీ చేసిన పనులు శాశ్వతంగా ప్రజలకు గుర్తుండేలా స్మృతివనం ఏర్పాటు చేస్తామని చంద్రబబు ప్రకటించారు. మోదీ ఆధ్వర్యంలో డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు.
పార్టీలు, ప్రభుత్వాలు కాదు దేశమే ప్రథమమన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయీ అని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. 1971లో భారత్-పాక్ యుద్ధం సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి బలమైన మద్దతుగా నిలబడ్డారని గుర్తు చేశారు. ఇప్పటి ప్రతిపక్షం ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశం వెన్నంటి ఉండాల్సింది పోయి మోదీ లక్ష్యంగా విమర్శలు చేస్తూ దేశాన్ని బలహీనపరిచే చర్యలకు పాల్పడిందని ఆయన ఆక్షేపించారు.
1998లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక వాజ్‌పేయీ-చంద్రబాబు భాగస్వామ్యం దేశంలో అద్భుతాలు సృష్టించిందని కేంద్ర మంత్రి చౌహాన్ గుర్తు చేశారు. ఇప్పుడు సమృద్ధి భారత్ కోసం నరేంద్ర మోదీ – చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వికసిత్ భారత్ కు మార్గదర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు. పోఖ్రాన్ అణ్వాయుధ పరీక్షలు చేశారని, అమెరికా అక్షలు విధించినా వాజపేయి పట్టించుకోలేదని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, గ్రామ వికాసం, స్వర్ణ చతుర్భుజికి పెద్ద పీట వేశారని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదురీదుతానని చెప్పేవారని తెలిపారు.

More Stories
అరుణాచల్ పై కన్ను.. అమెరికా నివేదికపై భగ్గుమన్న చైనా!
ఎట్టకేలకు మయన్మార్ లో ఆదివారం నుండి ఎన్నికలు
‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ