* 20 మంది బిజెపి సభ్యుల ప్రమాణస్వీకారంపై సిపిఎం అభ్యంతరం
కేరళలో బీజేపీ చరిత్ర సృష్టించింది.45 ఏళ్లుగా ఆధిపత్యం వహిస్తున్న సిపిఎం నేతృత్వంలోని వామపక్ష కూటమిని ఓడించి, ఇటీవల మునిసిపల్ ఎన్నికలలో విజయం సాధించిన బిజెపి మేయర్ పదవి కేరళలోనే మొదటి సారిగా పొందింది. తిరువనంతపురం మేయర్‌గా బీజేపీ నేత వీవీ రాజేశ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్‌గా ఎన్నికైన తర్వాత రాజేశ్ మాట్లాడుతూ కలిసికట్టుగా ముందుకు వెళ్తామని తెలిపారు. అన్ని 101 వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.
ఓ అభివృద్ధి చెందిన నగరంగా తిరువనంతపురం మారుతుందని భరోసా వ్యక్తం చేశారు. ఇది చరిత్రాత్మక సందర్భం అని చెబుతూ ఇది కేరళ రాజకీయాల్లో మార్పు తెస్తుందని, తిరువనంతపురంలో జరిగిన మార్పు యావత్ రాష్ట్రాన్ని మార్చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వీవీ రాజేశ్.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొడుంగనూరు వార్డు కౌన్సిలర్‌గా గెలిచారు.
ఆ విజయంతో ఇప్పుడు ఆయన తిరువనంతపురం మేయర్‌గా మారారు. మరో ఆరు నెలల్లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజేశ్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. 2016లో నీమమ్ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజాగోపాల్ గెలిచారు. ఆ తర్వాత 2024లో త్రిసూరు నుంచి సురేశ్ గోపి విజయం సాధించారు. మేయర్ రేసులో రాజేశ్‌కు 51 ఓట్లు లభించాయి. 50 మంది బిజెపి సభ్యులతో పాటు, ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా ఆయనకు ఓటు వేశారు.
తిరువనంతపురం మున్సిపాల్టీలో మొత్తం 100 మంది సభ్యులు ఉన్నారు. సీపీఎంకు చెందిన ఆర్పీ శివాజీకి 29, కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ శబరినాథన్‌కు 19 ఓట్లు పోలయ్యాయి. మరో స్వతంత్ర అభ్యర్థి గైర్హాజరు అయ్యారు. రెండో స్వతంత్య్ర కౌన్సిలర్ పీ రాధాకృష్ణన్ ఓటు విజయంలో కీలకంగా మారింది. డిసెంబర్ 9వ తేదీన జరిగిన వార్డు ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు దక్కాయి.
ఇలా ఉండగా, తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో నాటకీయ దృశ్యాలు వెలువడ్డాయి. 20 మంది బిజెపి కౌన్సిలర్లు వేసిన ఓట్ల చెల్లుబాటును సిపిఎం ప్రశ్నించింది. బిజెపి కౌన్సిలర్లు అనేక మంది నిర్దిష్ట దేవతల పేర్లతో ప్రమాణం చేయడం ద్వారా ప్రమాణ స్వీకార నియమాలను ఉల్లంఘించారని ఆరోపించింది.దీని వల్ల వారి ప్రమాణాలు చెల్లవని, తత్ఫలితంగా వారి ఓట్లు చెల్లవని వాదించింది.
అయితే, తిరువనంతపురం జిల్లా కలెక్టర్ అను కుమారి ఈ వాదనను తోసిపుచ్చారు. ప్రమాణం చేసిన వెంటనే, కౌన్సిలర్లు రిజిస్టర్‌లో సంతకం చేసి బాధ్యతలు స్వీకరించే ముందు అభ్యంతరం వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు.దీని ఫలితంగా సిపిఎం కౌన్సిలర్ ఎస్.పి. దీపక్, కలెక్టర్ మధ్య మాటల వాగ్వాదం జరిగింది.ప్రమాణంలో ఏదైనా ఉల్లంఘన జరిగితే ఇప్పుడు కోర్టులో మాత్రమే సవాలు చేయవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. అంతకుముందు, 20 మంది కౌన్సిలర్ల ప్రమాణాలు చెల్లవని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కలెక్టర్, ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదులు దాఖలు చేసింది.
More Stories
బాల పురస్కారం అందుకున్న క్రికెటర్ వైభవ్
ప్రపంచంకు భారత్ ఏమి ఇవ్వగలదో దృష్టి సారించాలి
అరుణాచల్ పై కన్ను.. అమెరికా నివేదికపై భగ్గుమన్న చైనా!