‘రాష్ట్ర ప్రేరణా స్థల్‌’ను ప్రారంభించిన ప్రధాని మోదీ

‘రాష్ట్ర ప్రేరణా స్థల్‌’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో రూ. 230 కోట్ల వ్యయంతో, 65 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ‘రాష్ట్ర ప్రేరణా స్థల్‌’ను మాజీ ప్రధాని వాజపేయి 101వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ కేంద్రం దేశానికి సేవ చేసిన మహానాయకుల ఆలోచనలు, ఆదర్శాలను ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో రూపొందించబడింది. 
విశాలమైన ప్రాంగణం, పచ్చదనం, సాంస్కృతిక శైలితో ఈ స్థల్ ప్రజలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
ప్రజా జీవనంలో నాయకత్వం, సేవా భావం ఎంత ముఖ్యమో గుర్తు చేసేలా ప్రతి భాగాన్ని రూపకల్పన చేశారు.  ఈ ప్రేరణా స్థల్‌లో శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు.  వారి జీవితం, ఆలోచనలు, దేశ పాలనకు అందించిన దిశానిర్దేశం తరతరాలకు అందాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాలు నిలుస్తాయి. దేశ ఐక్యత, అంత్యోదయ తత్వం, ప్రజాస్వామ్య విలువలు వంటి అంశాలను వారు ప్రతిపాదించిన విధానం నేటి తరానికి కూడా మార్గదర్శకమని ప్రధాని పేర్కొన్నారు.
ఈ కేంద్రం సందర్శించే వారికి ఆ నాయకుల ఆలోచనలతో ప్రేరణ కలిగేలా రూపొందించబడింది. ‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ దేశ సేవ, నాయకత్వ విలువలు, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించే వేదికగా నిలుస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ముఖ్యంగా యువతలో బాధ్యతాభావం, దేశభక్తి, ప్రజాసేవ పట్ల ఆసక్తి పెంచేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందని చెప్పారు. మంచి పాలన, నైతిక నాయకత్వం ఎంత అవసరమో గుర్తు చేసేలా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందని వివరించారు. 

భవిష్యత్ తరాలు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలనే ఆలోచనతో ఈ స్థల్‌ను రూపొందించినట్లు తెలిపారు. దేశ మహనీయులను కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత జరిగిన మంచి పనులన్నీ ఒకే కుటుంబానికి ఆపాదించారని విమర్శించారు.

“శ్యామాప్రసాద్‌, దీన్‌దయాల్, వాజ్‌పేయీ విగ్రహాలు గొప్ప స్ఫూర్తి ఇస్తాయి. డిసెంబర్‌ 25న ఇద్దరు మహనీయులు జన్మించారు. వాజ్‌పేయీ, మదన్‌మోహన్‌ మాలవీయ భారత ఏకత్వానికి కృషి చేశారు. ప్రేరణస్థల్‌ ప్రజల ప్రతి అడుగు జాతి నిర్మాణం దిశగా ఉండాలనే సందేశం ఇస్తుంది. ప్రజలందరి కృషితోనే వికసిత్‌ భారత్‌ సాకారం అవుతుంది” అని ప్రదాని తెలిపారు. 

“నేతల విగ్రహాలు ఎంత ఎత్తు ఉన్నాయో వాటి వల్ల కలిగే ప్రేరణ అంత కంటే గొప్పది. శ్యామాప్రసాద్‌, దీన్‌దయాల్‌ కలల సాకారానికి సంకల్పం తీసుకోవాలి. ప్రపంచం మొత్తం బ్రహ్మోస్‌ క్షిపణుల సామర్థ్యం చూసింది. బ్రహ్మోస్‌ క్షిపణులు లఖ్‌నవూలోనే తయారవుతున్నాయి. లఖ్‌నవూలో అతిపెద్ద డిఫెన్స్‌ కారిడార్‌ ఉంది. మొబైల్‌, ఇంటర్నెట్‌ వాడే దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. 11 ఏళ్లలో భారత్‌ మరో అతిపెద్ద మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి దేశంగా మారింది. మొబైల్‌ ఫోన్లు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది” అని ఆయన చెప్పారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసే అవకాశం ఎన్డీయే ప్రభుత్వానికి దక్కటం పట్ల బీజేపీ గర్వపడుతోందని ప్రధాని మోదీ తెలిపారు. బిజెపి సారథ్యంలోని ఉఇండోయూఏ ప్రభుత్వం అందించిన సుపరిపాలన వారసత్వం ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కొత్త శిఖరాలకు చేరిందని పేర్కొన్నారు. దేశ మహనీయులను కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేసిందని చెబుతూ స్వాతంత్ర్యం తర్వాత జరిగిన మంచి పనులన్నీ ఒకే కుటుంబానికి ఆపాదించారని ఆయన విమర్శించారు.