సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో మరో భారీ ఆర్థిక కుంభకోణం బయటపడింది. శ్రీరాంపూర్ డివిజన్‌లోని ఇందారంఖని ఓపెన్ కాస్ట్ (ఐకే-ఓసీపీ) ప్రాజెక్టులో ఓవర్‌బర్డెన్ (ఓబీ) తొలగింపు కాంట్రాక్టు పొందిన ఓ కాంట్రాక్టు సంస్థ నుంచి పెనాల్టీ రూపంలో రావాల్సిన రూ.25 కోట్లు మాఫీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కాంట్రాక్టు సంస్థ నిజామాబాద్‌కు చెందిన ఒక కాంగ్రెస్ కీలక నాయకుడి బంధువుకు సంబంధించింది కావడంతో ఉన్నతస్థాయి అధికారులు ఆ రూ.25 కోట్లు మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం ఏమీలేదని చూపించేందుకు గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ అధికారితో కమిటీ వేసి, వారికి అనుగుణంగా రిపోర్టు తెప్పించుకున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం సింగరేణి విజిలెన్స్ దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగిన సదరు అధికారులు, పక్కాగా విచారణ చేసి తప్పు కాంట్రాక్టర్‌దేనని నిగ్గుతేల్చడంతోపాటు పెనాల్టీ వసూలు చేయాల్సిందేనంటూ నివేదికను పై అధికారులకు సమర్పించారు.
విజిలెన్స్ నివేదికతో షాక్‌తిన్న సదరు ఉన్నతాధికారులు, ఏకంగా నిగ్గుతేల్చిన విజిలెన్స్ అధికారిని బదిలీచేయడంతోపాటు ఆ నివేదికను తొక్కిపెట్టి, కాంట్రాక్టర్‌కు మేలుచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. సింగరేణి సంస్థ ఇందారంఖని ఓసీలో బొగ్గుపై కప్పబడి ఉండే ఓవర్‌బర్డెన్ (మట్టి ) తొలగింపు పనులను ‘వరాహ జీకేఆర్ జేవీ’ అనే సంస్థకు అప్పగించింది.
నిబంధనల ప్రకారం నిర్ణీత కాలంలో పూర్తి చేయాల్సిన పనుల్లో ఈ జేవీ సంస్థ 30% మాత్రమే పూర్తి చేసినట్టు తెలుస్తున్నది. ఈ వైఫల్యం కారణంగా సింగరేణి సంస్థకు (10 లక్షల) ఒక మిలియన్ టన్నుల కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి నష్టం వాటిల్లింది. దీంతో సంస్థకు వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం ఏర్పడింది.
నిబంధనల ప్రకారం సదరు కాంట్రాక్టు సంస్థ నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేయకపోవడం వల్ల సింగరేణికి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంటూ సదరు కాంట్రాక్టు సంస్థపై రూ.25 కోట్ల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. మరోవైపు, ఈ వ్యవహారంపై రహస్య ఫిర్యాదు అందుకున్న సింగరేణి విజిలెన్స్ విభాగం ఓబీ తొలగింపులో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉన్నదని, దీనివల్లే సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తికి భారీగా నష్టం వాటిల్లిందని తేల్చినట్టు సమాచారం.
ఆ నివేదికను విజిలెన్స్ విభాగం పై స్థాయి అధికారులకు పంపించింది. దీంతో రూ.25 కోట్లు మాఫీ చేయడానికి విజిలెన్స్ నివేదిక అడ్డుగా ఉన్నదని భావించిన ఓ ఉన్నతాధికారి, అధికార పార్టీ నేతలు కలిసి ఆ నివేదికను బయటకు రాకుండా తొక్కిపెటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

More Stories
దేశ హితం, ఉద్యోగుల హితం, శ్రామికుల హితం కోసమేబీఎంస్
హైదరాబాద్ లో వాజ్‌పేయికు ఘన నివాళులు
25 నుంచి కన్హా శాంతి వనంలో ‘విశ్వ సంఘ్ శిబిర్ 2025’