పివిఎన్ మాధవ్, ఏపీ బిజెపి అధ్యక్షుడు
* 101వ జన్మదిన నివాళి… అమరావతిలో స్మ్రితి మందిర్ ప్రారంభం సందర్భంగా
“రాజకీయాలు చాలా క్రూరమైన ఆట. కానీ అటల్ జీ దానిని మానవత్వంతో కూడిన ఆటగా మార్చారు” మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి గురించి ఆయన సుదీర్ఘకాల సహచర రాజకీయ వేత్త డా. మురళీ మనోహర్ జోషి ఆయన మృతి సందర్భంగా చెప్పారు. ఆధునిక భారత రాజకీయాలలో ఆయనొక్క విలక్షణమైన నేత. జవహర్ లాల్ నెహ్రు నుండి ప్రముఖ రాజకీయ నేతలు అందరితో సన్నిహితంగా మెలిగారు. అయితే తనదంటూ విలక్షణమైన రీతిలో తాను నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడ్డారు.
జనతా పార్టీ విచ్ఛిన్నం కోసం ద్వంద్వ సభ్యత్వం వివాదాన్ని రేపిన సమయంలో ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు తెంచుకుంటే అధికారంలో కొనసాగవచ్చని అంటే, సైద్ధాంతిక మూలాలను వదులుకునేందుకు సిద్ధపడలేదు. ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రయోగించి, దేశ చరిత్రలోనే లేనివిధంగా కేవలం ఒక ఓటు తేడాతో అధికారం కోల్పోవలసి వచ్చిన సమయంలో కూడా తిరిగి ప్రజల వద్దకు వెళ్లి మద్దతుతో వచ్చేందుకు సిద్ధపడ్డారు గాని అనైతిక పద్ధతులకు మొగ్గుచూప లేదు.
వాజ్‌పేయి చేసిన అతిపెద్ద సేవ ఏమిటంటే, ఆయన భారతదేశంలో సంకీర్ణ, సామరస్య రాజకీయాలకు నాంది పలికారు. ఆ రోజుల్లో అది ఒక అద్భుతం. విభిన్న సిద్ధాంతాలు కలిగిన 21 రాజకీయ పార్టీల కూటమితో ఒక వ్యక్తి ఆరున్నర సంవత్సరాలు (ఒక పూర్తి పదవీకాలం, మరో పదవీకాలంలో ఒకటిన్నర సంవత్సరాలు) ఎలా పరిపాలించగలిగారు? అప్పటి వరకు 1977 నుండి సంకీర్ణ రాజకీయాలు మనుగడ సాగించలేక దేశంలో ఓ విధమైన అస్థిర రాజకీయాలు నెలకొన్న సమయంలో సుస్థిర పరిపాలనను అందించారు.
దీనదయాళ్ ఉపాధ్యాయతో కలిసి జనసంఘ్ రోజులలోనే 1967లో సంయుక్త విధాయక్ దళ్ ప్రభుత్వాల ఏర్పాటు ద్వారా దేశంలో సంకీర్ణ రాజకీయాలకు బీజం వేసిన నాయకులలో వాజపేయి ఒకరని చెప్పవచ్చు. ఒక ఓటుతో ఆయన ప్రభుత్వం పడిపోయినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఓటువేసిన చంద్రశేఖర్ వంటి అనేకమంది నాయకులు ఆయన దగ్గరకు వచ్చి ప్రభుత్వం పడిపోతుందని తెలిసి ఉంటె ఆ విధంగా వేసి ఉండేవారం కాదని చెప్పడం గమనిస్తే ఆయన అన్ని పక్షాల విశ్వాసం పొందారని చెప్పవచ్చు.
ఆయన సౌమ్యుడు, హాస్యప్రియుడు, మాత్రమే గాక నిజమైన రాజనీతిజ్ఞుడిగా అందరిని కలుపుకు పోవడంతో ఆయన ప్రదర్శించిన రాజనీతి భారత దేశంలో మరెవ్వరూ అనుసరింపలేక పోయారని చెప్పవచ్చు. జీవితంలోని అన్ని రంగాలలోనూ వైరుధ్యాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి రెండు పద్ధతులు ఉన్నాయి: ఒకటి, పోరాడి తేల్చుకోవడం. లేదా, విభేదాలను అంగీకరించి, పోరాడుతున్న పక్షాల మధ్య ఎలా సయోధ్య కుదర్చవచ్చో కనుగొనడం. ఇది మానవాళికి, సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సందర్భంగా మనకు వాజపేయి మాత్రమే గుర్తుకు వస్తారు.
పరిష్కరించలేని కాశ్మీర్ సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు, రాజ్యాంగ పరిధిలోనే అది పరిష్కరించబడుతుందా? అని ఒకరు అటల్ జీని అడిగారు. దానికి ఆయన, అది జంహూరియత్ (ప్రజాస్వామ్యం), ఇన్సానియత్ (మానవత్వం) ఆధారంగా పరిష్కరించబడుతుందని సమాధానం ఇచ్చారు. ఇది ఒక కొత్త ఆలోచన. రాజకీయాల పట్ల, సాధారణంగా జీవితం పట్ల ఆయనకున్న దృక్పథానికి ప్రతీక. నేటి ప్రతికూల రాజకీయాల కాలంలో అందరికి మార్గదర్శిగా ఉంటుంది.
రాజకీయాలలో మానవతా విలువలకు, జాతీయ ప్రయోజనాలకోసం సంకుచిత రాజకీయాలను పక్కన ఉంచడంలో, అందుకోసం భిన్నమైన రాజకీయ పార్టీలు, వ్యక్తులతో కలిసి ప్రయాణించడంలో, ప్రజలకు చేరువైన పరిపాలన అందించడంలో ఆయన సరికొత్త ప్రమాణాలను, వరవడిని ఏర్పాటు చేశారు. అదే సమయంలో జాతీయ సమగ్రతకు, దేశ రక్షణకు రాజీలేని విధానాలను అనుసరించారు. విదేశాంగ మంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రపంచవ్యాప్తంగా విశేషమైన గౌరవం పొందడమే కాకూండా, అందరితో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడంలో విజయం సాధించారు.
ప్రజల అభ్యున్నతి పట్ల ఆయనకున్న నిబద్ధత సాటిలేనిది. తన సుదీర్ఘ ప్రజా జీవితంలో, మంత్రివర్గంలో, వెలుపలా ఎప్పటికప్పుడు వివిధ సమస్యలు తలెత్తినా, ఆయన వాటిని నమ్మకం, సహకారం, చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించారు. అలాగే ప్రజలను ఒప్పించి ఏకాభిప్రాయానికి తీసుకువచ్చారు. తద్వారా, ఆయన ఏకాభిప్రాయ రాజకీయాలకు ఒక ఆదర్శాన్ని నెలకొల్పారు.
ఒక రోజు, విజయం సాధించిన భారత క్రికెట్ జట్టును కలుసుకున్నప్పుడు, ఆయన ఒక ఆటగాడి బ్యాట్‌పై ఇలా రాశారు: “కేవలం ఆటనే గెలవకండి; ప్రజల హృదయాలను గెలవండి. మీరు ఆట గెలిచి, వారి హృదయాలను కోల్పోతే, మీరు ఓడిపోయినట్లే.” ఈ దృక్పథం ఆయన జీవితంలోని అన్ని రంగాలలోనూ ప్రతిబింబించింది. ఆయన ఆరున్నర సంవత్సరాలు దేశాన్ని పరిపాలించారనే దానితో కాకుండా, ఆయన ప్రజల హృదయాలను పరిపాలించారనే దానితో మనం ఆయనను అంచనా వేయాలి.
ఆయనకు కేవలం పరిపాలనా సామర్థ్యమే కాకుండా, తాను చేస్తున్నది సరైన పనే అని ప్రజలను ఒప్పించగల కళ కూడా ఉంది. ఆయన ఏకాభిప్రాయం, ఆచరణాత్మకత కలిగిన వ్యక్తి కావడం కారణంగానే 2000లో ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ అనే మూడు కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు వీలు కల్పించింది. తన శవం మీదనే బీహార్ విభజన జరుగుతోందని భీష్మించుకుని కూర్చున్న లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారిని కూడా ఒప్పించి ఎటువంటి అలజడులు, వివాదాలు లేకుండా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయగలిగారు. అదే తెలుగు రాష్ట్రాల విభజన ఎంత గందరగోళంగా జరిగిందే వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
1998 నాటి ఫోఖ్రాన్ పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్థానాన్ని పునర్నిర్వచించాయి. ఆ ఒక్క చర్య భారతదేశానికి, భారతీయులకు గౌరవాన్ని సంపాదించిపెట్టింది. అమెరికా వంటి దేశాలు ఆగ్రహంతో భారత్ పై ఆంక్షలు విధించినా ధీరోచిత్తంతో ఎదుర్కొని, చివరకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి భారత్ కు దూరంగా, పాకిస్తాన్ కు సానుకూలంగా వ్యవహరిస్తున్న అమెరికాతో సంబంధాలను మెరుగు పరిచేందుకు విశేషమైన కృషి చేశారు.
బహుశా పాకిస్తాన్ ప్రజల హృదయాలను మాత్రమే కాకుండా కాశ్మీర్ ప్రజల హృదయాలను సహితం అమితంగా గెల్చుకున్న మరో భారతీయ నాయకుడు ఆయన తప్ప లేరని చెప్పవచ్చు. విదేశాంగ మంత్రిగా పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక రోడ్ కు ఆయన పేరు పెట్టారు. శ్రీనగర్ లో మరే ప్రధాని కూడా వాజపేయి పాల్గొన్నట్టు భారీ బహిరంగ సభలో పాల్గొనలేదు.
గత 77 ఏళ్లలో భారత్ సాధించిన అతిపెద్ద దౌత్య విజయం అంతర్జాతీయంగా పాకిస్థాన్ ను ఏకాకి చేయడం కేవలం ఆయనకే సాధ్యమయింది. కార్గిల్ యుద్ధం సందర్భంగా ఆ సమయంలో పాకిస్థాన్ కు మద్దతుగా ఉన్న అమెరికా, చైనాలు సహితం ముందుగా స్వచ్ఛందంగా కార్గిల్ పర్వతాల నుండి సైనికులను ఉపసంహరించుకొని మాట్లాడమని మందలించాయి.
“మీరు పొరుగువారిని కాదు, స్నేహితులను మార్చుకోవచ్చు” అనే ఆయన ప్రసిద్ధ పదాలు భారతదేశ విదేశాంగ విధానానికి ఇప్పటికీ మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి. పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంకు ప్రాధాన్యత ఇచ్చిన తొలి నేత అని కూడా చెప్పవచ్చు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన సైనికులను ప్రజలు గౌరవించుకునేందుకు వీలుగా వాజ్‌పేయి ప్రభుత్వం అమరవీరుల మృతదేహాలను వారి ఇళ్లకు తీసుకురావడానికి అనుమతించింది.
యువ ఎంపీగా ఉన్న వాజపేయిని భారత్ కు ప్రధాని కాగల నాయకుడని నెహ్రు ఓ విదేశీ అతిథికి పరిచయం చేయడం, 1971 యుద్ధం సమయంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీకి కొండంత అండగా నిలబడటం, ఆర్ధిక సంస్కరణలు తీసుకు రావడంలో పివి నరసింహారావు ప్రభుత్వంకు మద్దతుగా వ్యవహరించడం జాతీయ ప్రయోజనాలకోసం సంకుచిత రాజకీయాలను దరిచేరనీయని ఆయన రాజనీతిజ్ఞతను వెల్లడి చేస్తుంది.
పీవీ నరసింహారావు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో దుర్భరమైన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రూపాయి విలువ తగ్గించాలని, అందుకై అనుమతి కోసం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయమని నాటి ఆర్ధిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రధాని నరసింహారావును కోరారు. మంత్రివర్గం ముందు ఈ అంశం పెడితే ఆమోదం పొందటం కష్టమని అంటూ నరసింహారావు కొంచెం వ్యవధి అడిగారు.
ఓ గంట తర్వాత రూపాయి విలువ తగ్గించేందుకు అనుమతి ఇచ్చారు. గంట వ్యవధిలో ఈ సమస్య ఏవిధంగా పరిష్కరించారో మన్మోహన్ సింగ్ కు అర్ధం కాలేదు. అదే అడిగితే `వాజపేయితో మాట్లాడాను, ఆయన దీనిపై నిరసనలు చేయబోమని హామీ ఇచ్చారు, ప్రతిపక్ష నేత నుండి సానుకూలత లభిస్తే ఇంకా అడ్డేముంది?’ అంటూ రహస్యం చెప్పారు. జాతీయ ప్రయోజనాలకోసం ఎల్లప్పుడూ నిలబడిన నేత అని స్పష్టం అవుతుంది.
ప్రధానిగా ఆయన పదవీకాలంలో ప్రారంభమైన ప్రజా-కేంద్రీకృత కార్యక్రమాలు భారతదేశ పరివర్తన ప్రయాణంలో సుపరిపాలనకు మైలురాళ్ళుగా మారాయి. దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. స్వాతంత్ర్యం తర్వాత, సుపరిపాలన పాలన సంస్కరణలకు కేంద్ర బిందువుగా ఉంది, కానీ చర్చలలో మాత్రమే. ఇది రాజ్యాంగ సభలో చర్చలు, ప్రణాళికా సంఘం వంటి సంస్థలు తయారుచేసిన విధాన పత్రాలకె పరిమితమవుతూ వచ్చింది. కానీ ఆలోచనలు పేలవమైన అమలు రికార్డుతో కాగితంపైనే ఉన్నాయి.
వాజ్‌పేయి దార్శనిక నాయకత్వంలో, అది మారిపోయింది. పాలనను మెరుగుపరచడానికి చేసిన ప్రయత్నాలు ప్రజల జీవితాల్లో ప్రతిబింబించడం ప్రారంభించాయి. వాజ్‌పేయి పార్లమెంటులో చాలా కాలం పనిచేశారు. ఆయన 10 పర్యాయాలు లోక్‌సభ ఎంపీగా, రెండు పర్యాయాలు రాజ్యసభలో పనిచేశారు. సుపరిపాలనపై వెలుగు నింపడానికి ఆయన ఈ వేదికను ఉపయోగించారు.
ప్రతిపక్ష సభ్యుడిగా, ఆయన సహేతుకమైన వాదనలు, నిర్మాణాత్మక విమర్శలు అందరినీ ఆకట్టుకునేవి. సంక్షేమ-కేంద్రీకృత పాలన వ్యవస్థను సృష్టించడానికి ప్రేరణనిచ్చాయి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో చేపట్టిన కిసాన్ క్రెడిట్ కార్డు, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, స్వర్ణ చతుర్భుజి, నదుల అనుసంధానం, జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం, సర్వ శిక్షా అభియాన్, గిరిజన వ్యవహారాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ వంటి పథకాలు, ఆలోచనలు సమాజంలోని ప్రతి వర్గాన్ని తాకాయి.
విద్యుత్ రంగంలో నియంత్రణ చట్రాన్ని మెరుగుపరచడానికి పాక్షిక-న్యాయ కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ చట్టాన్ని సవరించారు. 21వ శతాబ్దం ప్రారంభంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వాజ్‌పేయి సుపరిపాలన గురించి మాట్లాడారు. ప్రధానమంత్రి మోదీ తన లక్ష్యాలను సాధించడానికి ఈ చర్యల వేగాన్ని, స్థాయిని పెంచారు.
వాజ్‌పేయి ప్రభుత్వం అనేక దేశీయ ఆర్థిక, మౌలిక సదుపాయాల సంస్కరణలను ప్రవేశపెట్టింది. వాటిలో ప్రైవేట్ రంగాన్ని, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రభుత్వ వ్యర్థాలను తగ్గించడం, పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడం, కొన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల ప్రైవేటీకరణ ఉన్నాయి. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించినా ఎటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనని నేతగా మిగిలారు. పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేకంగా ఓ మంత్రివర్గం ఏర్పాటు చేసి, అరుణ్ శౌరి వంటి ప్రముఖ జర్నలిస్టును ఆ శాఖ మంత్రిగా చేశారు. అయినా ఎవ్వరూ ఆయనపై గాని, ఆయన మంత్రిపై గాని ఎటువంటి అవినీతి ఆరోపణలు చేసే సాహసం చేయకపోవడం గమనార్హం.
సుపరిపాలన అనేది రాజ్యాంగ పరిధిలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం ద్వారా వారికి సేవ చేయడానికి ఒక సాధనం. అటల్ జీ దార్శనికత, నాయకత్వం, మార్గదర్శకత్వం, అమూల్యమైన అంతర్దృష్టులు వర్తమాన, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తాయి. అందుల్లనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని `సుపరిపాలన దినం’గా పాటిస్తూ వస్తున్నది. దేశం సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణంలో, మనం ఆత్మపరిశీలన చేసుకుని, నవ భారతదేశ నిర్మాణానికి ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ స్ఫూర్తితో పనిచేయడానికి ప్రతిజ్ఞ చేద్దాం.

More Stories
నిర్మాణపర లోపాలు సరిచేసే విబి-జి రామ్ జి చట్టం 2025
ఆరావళి పర్వతాల్లో మైనింగ్ నిషేధం
కాంగ్రెస్ లో ప్రియాంక గాంధీ నాయకత్వంపై దుమారం!