త్వరలో అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్, శంఖ్ విమాన సేవలు

త్వరలో అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్, శంఖ్ విమాన సేవలు

రెండు కొత్త విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్‌కు విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్లు (ఎన్వోసీ) మంజూరు చేసింది. దీంతో ఈ రెండు విమానయాన సంస్థలతో పాటు ఇప్పటికే ఎన్వోసీ పొందిన శంఖ్ ఎయిర్ కూడా కొత్త ఏడాది నుంచి సేవలు ప్రారంభించనున్నాయి.

శంఖ్ ఎయిర్ కు ఇంతకుముందే అనుమతి ఇచ్చారు. పౌర విమానయాన మంత్రి కే రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు. ‘భారత విమానయాన రంగంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తున్న కొత్త విమానయాన సంస్థలు శంఖ్ ఎయిర్, అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్‌ల బృందాలను గత వారం రోజులుగా కలవడం సంతోషంగా ఉంది. శంఖ్ ఎయిర్ ఇప్పటికే మంత్రిత్వ శాఖ నుంచి ఎన్వోసీ పొందింది. అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ కూడా ఈ వారం ఎన్వోసీలు అందుకున్నాయి’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
 
కాగా, ఉత్తరప్రదేశ్‌ కేంద్రంగా శంఖ్ ఎయిర్ కార్యకలాపాలు నిర్వహించనున్నది. అల్ హింద్ ఎయిర్‌ను కేరళకు చెందిన అల్‌ హింద్‌ గ్రూప్ ప్రమోట్‌ చేస్తున్నది. ఈ రెండితోపాటు ఫ్లైఎక్స్‌ప్రెస్ కూడా 2026లో తొలుత దేశీయంగా విమానాలు నడిపేందుకు సిద్ధమయ్యాయి. ఫ్లైఎక్స్‌ప్రెస్ సంస్థకు హైదరాబాద్‌కు చెందిన ఒక కొరియర్ మరియు కార్గో సేవల సంస్థ మద్దతు ఇస్తుంది.

మరోవైపు ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై బిగ్ అక్టోబర్‌లో విమాన సేవలను నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం తొమ్మిది దేశీయ విమానయాన సంస్థలు పనిచేస్తున్నాయి. అయితే ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థల దేశీయ విమానయాన మార్కెట్ వాటా 90 శాతానికి పైగా ఉన్నది.