చంద్రుడిపై రాబోయే పదేళ్లలోనే విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రష్యా ప్రణాళికలు రూపొందిస్తోంది. తమ లూనార్ ప్రోగ్రామ్‌కు అవసరమైన విద్యుత్‌తో పాటు రష్యా–చైనా సంయుక్త పరిశోధనా కేంద్రానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది. రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్కాస్‌మస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
చంద్రుడిపై 2036 నాటికి విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రణాళికను రూపొందించినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు రష్యాకు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ లావొచ్‌కిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ విద్యుత్ కేంద్రం ద్వారా చంద్రుడిపై పనిచేసే రోవర్లు, అబ్జర్వేటరీలు, భవిష్యత్‌లో ఏర్పాటు చేయనున్న పరిశోధనా కేంద్రాలకు అవసరమైన శక్తిని అందించాలన్నది రష్యా లక్ష్యంగా పెట్టుకుంది.
రష్యా– చైనా కలిసి చంద్రుడిపై సంయుక్తంగా పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఆ కేంద్రానికి అవసరమైన మౌలిక వసతుల్లో విద్యుత్ సరఫరా కీలక పాత్ర పోషించనుంది. అందుకే ఈ విద్యుత్ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాస్కాస్‌మస్ పేర్కొంది.
చంద్రుడిపై దీర్ఘకాలిక పరిశోధనలకు, అక్కడ మానవ కార్యకలాపాలు సాగించేందుకు స్థిరమైన విద్యుత్ వనరు అవసరమని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విద్యుత్ కేంద్రం స్వరూపం ఏంటన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇది అణువిద్యుత్ కేంద్రం అయ్యే అవకాశాలున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచారం చేస్తున్నాయి.
చంద్రుడిపై సౌర విద్యుత్‌తో పాటు అణు విద్యుత్ వినియోగంపై కూడా పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. అయితే, ఈ అంశంపై రష్యా సంస్థ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ప్రాజెక్టు రూపురేఖలు, భద్రతా అంశాలు, సాంకేతిక సవాళ్లపై మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది. అంతరిక్ష పరిశోధనల్లో ఒకప్పుడు అగ్రగామిగా నిలిచిన రష్యా గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే రష్యా కాస్త వెనకబడినట్లు కనిపిస్తోంది.
ఇటీవల చేపట్టిన కొన్ని ప్రతిష్ఠాత్మక ప్రయోగాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. 2023 ఆగస్టులో రష్యా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన లూనా-25 మిషన్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ముందే విఫలమైంది. మరోవైపు, అమెరికా, చైనా మాత్రమే కాకుండా ప్రైవేటు రంగం కూడా అంతరిక్ష పరిశోధనల్లో దూసుకెళ్తోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ వరుస విజయాలతో ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇస్తోంది.

More Stories
అమెరికా ఉద్యోగాలు క్రైస్తవులకే… హెచ్1బీ వీసాలపై జేడీ వాన్స్
విమానం కూలి లిబియా సైన్యాధిపతి మృతి!
హాదీ హత్య వెనుక యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు