రూ.12 వేల కోట్లతో ఢిల్లీ మెట్రో విస్తరణ

రూ.12 వేల కోట్లతో ఢిల్లీ మెట్రో విస్తరణ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఢిల్లీ మెట్రో రైలు విస్తరణకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.12,015 కోట్లతో ఐదో దశలో 13 స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ దశలో 16 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో ఢిల్లీ మెట్రో మొత్తం పొడవు 400 కిలోమీటర్ల మార్కు చేరుకోనుంది. మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఫేజ్ 5 ఏలో 10 అండర్‌ గ్రౌండ్, మూడు ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. మొత్తం మూడు కారిడార్లలో ఆర్కే ఆశ్రమ్ మార్గ్ నుంచి ఇంద్రప్రస్థ వరకూ 9.9 కిలోమీటర్లకు రూ.9,570 కోట్లు, ఏరో సిటీ నుంచి ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-1 వరకూ 2.3 కి.మీలకు రూ.1,419 కోట్లు, తుగ్లాకాబాద్ నుంచి కాళింద్ కుంజ్ వరకూ 3.9 కి.మీలు రూ.1,024 కోట్లు కేటాయించినట్టు మంత్రి వెల్లడించారు.

దీని వల్ల ఢిల్లీలో ఏటా 33 వేల టన్నుల కార్బన ఉద్గారాలు నియంత్రణ సాధ్యమవుతుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. భవిష్యత్తులో టెర్మినల్ 1 నుంచి విమానాలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తాయని, ఈ కారిడార్‌ టెర్మినల్ 1 నుంచి ఏరో సిటీకి, అక్కడ నుంచి రైడ్‌ లైన్‌ సిటీ సెంట్రల్‌లోని శివాజీ నగర్‌ స్టేషన్‌కు అనుసంధానం అవుతుందని మంత్రి పేర్కొన్నారు.


ఈ కారిడార్ పూర్తయిన తర్వాత ఢిల్లీలో అనుసంధానం మెరుగుపడి, ట్రాఫిక్ రద్దీ తగ్గి, స్థిరమైన పట్టణ రవాణాకు ప్రోత్సాహం లభించనుంది. ఇదిలా ఉండగా, ఢిల్లీ మెట్రో బుధవారం నాటికి 23 ఏళ్లు పూర్తికావడంతో వేడుకలు జరుపుకుంది. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్ 352 కిలోమీటర్లకు పైగా విస్తరించి, ఎయిర్‌పోర్ట్ లైన్ సహా మొత్తం పది లైన్లలో 257 స్టేషన్లతో సేవలందిస్తోంది. 
 
ఇటీవలే ఢిల్లీ మెట్రో రైలుకు చెన్నైలోని ఇండియన్ కాంక్రీట్ ఇన్‌స్టిట్యూట్ (ఐసిఐ) ప్రతిష్టాత్మక ఐసిఐ అవార్డ్స్ 2025‌కు ఎంపిక చేసింది. మౌజ్‌పూర్– మజ్లిస్ పార్క్ కారిడార్‌‌లో అత్యుత్తమ ప్రీస్ట్రెస్‌డ్ కాంక్రీట్ నిర్మాణానికి ఈ అవార్డు అందించింది. మౌజ్‌పూర్–మజ్లిస్ పార్క్ కారిడార్ ఢిల్లీ మెట్రో ఫేజ్–IV విస్తరణలో కీలక భాగం. ఇది ప్రస్తుతం ఉన్న పింక్ లైన్‌కు పొడిగింపుగా పనిచేస్తుంది.