ఓలా, ఉబర్‌కు పోటీగా ‘భారత్‌ ట్యాక్సీ’

ఓలా, ఉబర్‌కు పోటీగా ‘భారత్‌ ట్యాక్సీ’
ఓలా, ఉబర్‌కు పోటీగా త్వరలోనే భారత్ ట్యాక్సీ సర్వీసును ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఇందులో వచ్చే లాభాలను డ్రైవర్లకు పంచే విధంగా ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు వివరించారు. వినియోగదారులకు సౌకర్యంతో పాటు డ్రైవర్లకు అదనపు ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

హరియాణా పంచకులలో జరిగిన సహాకారి సమ్మేళన్​లో మాట్లాడిన ఆయన  “కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే భారత్ ట్యాక్సీ సర్వీసును ప్రారంభించబోతున్నాం. ఇందులో వచ్చే లాభమంతా డ్రైవర్లకే దక్కుతుంది. దీంతో అటు వినియోగదారులకు సౌకర్యంతో పాటు డ్రైవర్లకు ఆదాయం పెరుగుతుంది” అని ప్రకటించారు.

మరోవైపు యాప్‌ ఆధారిత ట్యాక్సీ సర్వీసులపై కొన్ని సంవత్సరాలుగా వినియోగదారుల నుంచి అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరలు, క్యాన్సిలేషన్లతో పాటు తమ ఆదాయం నుంచి కంపెనీలు 25 శాతం వరకు కమీషన్ తీసుకోవడంపై డ్రైవర్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టేలా కేంద్రం భారత్‌ ట్యాక్సీని తీసుకొస్తోంది.  ఇందులో నమోదు చేసుకున్న ట్యాక్సీ డ్రైవర్లు ఎలాంటి కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేకుండా కేవలం మెంబర్‌షిప్‌ కింద స్వల్ప మొత్తం ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

కాగా, ఇప్పటికే ప్రైవేటు సంస్థలను సవాల్ చేసేలా ఈ సహకార ట్యాక్సీని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్‌ అభివృద్ధి చేసింది.  పైలట్ ప్రాతిపదికన ఢిల్లీలో తొలుత 650 మంది సొంతవాహనాలు కలిగిన డ్రైవర్లు ఈ సేవలను ప్రారంభించారు. పైలట్‌ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఆ తర్వాత దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. 2026 మార్చి నాటికి మెట్రో నగరాల్లో ఈ భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

2030 నాటికి లక్ష మంది డ్రైవర్లను ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం చేయాలని అంచనా వేస్తోంది.  2025 జూన్‌లో ఏర్పాటు చేసిన సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ కింద ఈ ట్యాక్సీ సేవలు అందనున్నాయి. ఈ సహకార్‌ ట్యాక్సీ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌లో గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (అమూల్‌), ఇఫ్కో, క్రిబ్కో, నాఫెడ్, ఎన్‌డీడీబీ, ఎన్‌సీఈఎల్, ఎన్‌సీడీసీ, నాబార్డ్‌లు ప్రమోటర్లుగా ఉన్నాయి. ఈ సంస్థ బోర్డులో ఇద్దరు డ్రైవర్లకు ప్రాతినిధ్యం ఉంటుంది.

ఓలా, ఉబర్, ర్యాపిడో మాదిరి కార్లు, ఆటోలు, బైక్‌ల ద్వారా ప్రయాణాల కోసం బుక్‌ చేసుకునే వీలును ఇది కల్పిస్తుంది. గుజరాత్‌లోనూ డ్రైవర్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతోందని సహకార్‌ ట్యాక్సీ కో-ఆపరేటివ్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ జయేన్‌ మెహతా వెల్లడించారు. భారత్‌ ట్యాక్సీ యాప్‌లో ఇప్పటి వరకు 51,000 మంది డ్రైవర్లు నమోదైనట్లు తెలిపారు.