బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న హింస పట్ల యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ హిందూ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన పట్ల ఆయన రియాక్ట్ అయ్యారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్న విషయం వాస్తవమే అని యూఎన్ సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు.
బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయన్న అంశంపై స్పందన కోరగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ అయినా మరే ఇతర దేశమైనా, మెజార్టీకి చెందని ప్రజలు సురక్షితంగా ఉండాలని, బంగ్లాదేశీయులందరూ సేఫ్‌గా ఉండాలని, దేశంలోని ప్రతి పౌరుడు సురక్షితంగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విశ్వాసంతో ఉన్నట్లు డుజారిక్ తెలిపారు
బంగదేశ్‌లోని అనేక మీడియా సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మీడియా సంస్థలను టార్గెట్ చేయడంలో తమ జీవన హక్కు ప్రమాదంలో పడినట్లు బంగ్లా జర్నలిస్టులు ఆరోపించారు. బంగ్లా మీడియా ప్రస్తుతం దీన అవస్థలో ఉన్నదని, భావస్వేచ్ఛను హరించారని జర్నలిస్టులు పేర్కొన్నారు. ఢాకాలో ఉన్న ప్రోతమ్ ఆలో, ద డెయిలీ స్టార్ వార్తాపత్రికల ఆఫీసులకు నిప్పు పెట్టిన ఘటన నేపథ్యంలో పలువురు ఎడిటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆఫీసులకు నిప్పుపెట్టిన సమయంలో చాలా మంది జర్నలిస్టులు లోపలే చిక్కుకుపోయారని, పోలీసులు.. ఫైర్ సర్వీసులను రాకుండా అడ్డుకున్నారని ఎడిటర్లు ఆరోపించారు. భావస్వేచ్ఛ ఇప్పుడో సమస్య కాదు అని, అసలు బ్రతికి ఉండ డమే ఇప్పుడు సమస్యగా మారినట్లు డెయిలీ స్టార్ ఎడిటర్ మహఫూజ్ ఆనమ్ తెలిపారు. మరోవైపు విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్ వోల్కర్ టర్క్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రతీకారం, ప్రతిఘటన హింసను మరింత పెంచుతాయని, అవి విభేదాలను మరింత పెంచి, అందరి హక్కులను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. హాది హత్యకు కారణమైన దాడిపై త్వరిత, నిష్పక్షపాత, పారదర్శక దర్యాప్తు జరిపించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి బంగ్లాదేశ్ అధికారులను కోరారు.

More Stories
అమెరికా నుండి వెళ్ళిపోతే రూ.2.68 లక్షల స్టైపెండ్
వంద ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా?
కారు బాంబు దాడిలో రష్యన్ జనరల్ మృతి