17 ఏళ్ల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వస్తున్న భారత్ వ్యతిరేక నాయకుడు తారిక్ రెహమాన్ రాక కోసం బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది. ఆయన గురువారం స్వదేశంకు చేరుకోనున్నారు. ఎన్నికలు జరగనున్న ఈ దేశంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే బీఎన్‌పీ తాత్కాలిక చైర్మన్ అయిన రెహమాన్ రాక దేశంలోని రాజకీయ సమీకరణాలను మార్చగలదు.
తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు. రెహమాన్ తల్లి, బీఎన్‌పీ చైర్‌పర్సన్ అయిన ఖలీదా జియా అనారోగ్య కారణాల వల్ల ప్రధాన స్రవంతి రాజకీయాలకు దూరమైన సమయంలో ఆయన రాక జరుగుతోంది. షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో అవినీతి, లంచం, మనీలాండరింగ్, అక్రమ ఆస్తుల సంపాదన, గ్రెనేడ్ దాడులతో సహా పలు ఆరోపణలపై కోర్టులచే దోషిగా నిర్ధారించటంతో, చట్టపరమైన సమస్యల కారణంగా ఆయన ప్రవాసంలో ఉంటూ పార్టీని నడిపిస్తున్నారు.
అయితే, హసీనా ప్రభుత్వం పతనం తర్వాత, రెహమాన్ ముందున్న చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి, ఇది ఆయన తిరిగి రావడానికి మార్గం సుగమం చేసింది. ఆయన నవంబర్‌లో స్వదేశానికి తిరిగి వస్తారని భావించినప్పటికీ, దేశంలో నెలకొన్న భద్రతా సమస్యల కారణంగా రెహమాన్ తన పర్యటనను నెల రోజులకు పైగా వాయిదా వేసినట్లు చెబుతున్నారు.
తారిక్ రెహమాన్ తీవ్ర భారత్ వ్యతిరేకి అని చెబుతారు. విదేశాంగ విధానం, తీస్తా నదీ జలాల పంపకాల ఒప్పందానికి సంబంధించిన అనేక సమస్యలపై తన వైఖరిని గట్టిగా వినిపించారు. ఆసక్తికరంగా, రెహమాన్ పాకిస్థాన్‌తో కూడా సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి ఇష్టపడటం లేదు. “ఢిల్లీ కాదు, పిండి కాదు, మరే ఇతర దేశం కాదు. ముందుగా బంగ్లాదేశే,” అని హసీనా పతనం జరిగిన కొన్ని నెలల తర్వాత మే నెలలో ఆయన పేర్కొన్నారు.
దేశంలో రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు గందరగోళం సృష్టిస్తున్న కీలక సమయంలో ఆయన రాక జరుగుతోంది. బంగ్లాదేశ్‌లో రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి: షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్, ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. అవామీ లీగ్‌ను ఎన్నికలలో పాల్గొనకుండా నిషేధించడంతో, బీఎన్‌పీ తిరిగి రావడానికి మార్గం సుగమమైంది. అయితే, రాడికల్ పార్టీలు బీఎన్‌పీ మద్దతు స్థావరాన్ని తగ్గించి, తాము బలపడాలనే ఆశతో ఎన్నికలను ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఒకవేళ బీఎన్‌పీ గెలిస్తే, తారిక్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆయన తనను, తన పార్టీని ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అతిపెద్ద ప్రతిపాదకులుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఇప్పటికే తన ప్రచార ప్రణాళికను రూపొందించి, ఎన్నికల్లో గెలిస్తే అమలు చేయబోయే కార్యక్రమాలను ప్రకటించారు. ఇటీవల ఒక పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యం మాత్రమే దేశాన్ని ఈ సంక్షోభం నుండి బయటపడగలదు, మరియు ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడం ప్రతి బీఎన్‌పీ కార్యకర్త బాధ్యత” అని చెప్పారు.
రహమాన్ 2008లో తన కుటుంబంతో కలిసి దేశం విడిచి వెళ్ళినప్పటి నుండి విదేశాలలో నివసిస్తున్నారు. తారిఖ్ రహమాన్ 18 నెలల పాటు జైలులో గడిపి, సెప్టెంబర్ 3, 2008న విడుదలైన తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లారు. షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో, అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన బీఎన్‌పీకి వ్యతిరేకంగా రాజకీయ ప్రేరేపిత కేసులుగా భావించిన అనేక కేసులలో ఆయన దోషిగా నిర్ధారింఛారు. అప్పటి నుండి, అతను తన కుటుంబంతో కలిసి యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివసిస్తూ విదేశాల నుండే పార్టీని నడుపుతున్నారు.

More Stories
రాహుల్ జరుపుతుంది ‘భారత్ బద్నామ్ యాత్ర’
కేరళలో 24, ఛత్తీస్‌గఢ్‌లో 27, ఎంపీలో 42 లక్షల ఓట్ల తొలగింపు
విద్య, ఆరోగ్యం అందరికీ, ప్రతిచోటా అందుబాటులో ఉండాలి