ఒడిశాలో 22 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఒడిశాలో 22 మంది మావోయిస్టుల లొంగుబాటు
లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడమే కాకుండా.. ప్రభుత్వం తరఫున అందిస్తున్న ఆర్థిక సాయాన్ని మరింత పెంచుతామంటూ ఒడిశా ప్రభుత్వం ప్రకటించిన కొన్ని గంటలకే 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మంగళవారం మల్కాన్‌గిరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరిందరిపై రూ1.89 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. 
 
లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను డీజీపీ వై బి. ఖురానియా వెల్లడిస్తారని పేర్కొన్నారు. ఇంత మంది లొంగిపోవడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారని వివరించారు.  కలాహండి, కంధమాల్, బలంగీర్, మల్కాన్‌గిరి, కోరాపుట్, నబరంగ్‌పూర్, నౌపడా, రాయగడ, బౌధ్ జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉంది.  అయితే ఒడిశాలోని కోరాపుట్, మల్కాన్‌గిరి, కలహండి, నబరంగ్‌పూర్, నౌపడా, బలంగీర్ జిల్లాలు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్నాయి. ఈ ఆరు జిల్లాల్లో మావోయిస్టుల ప్రాభవం అధికంగా ఉంది. 
ఇక ఈ రోజు లొంగిపోయిన మావోయిస్టులంతా ఏసీఎం, డీసీఎంలే ఉన్నారని వివరించారు. వీరిపై రూ. 5.5 లక్షల నుంచి రూ. 27.5 లక్షల వరకు రివార్డు ఉందని చెప్పారు.  రాష్ట్రంలో మావోయిస్టులు లొంగిపోతే పొరుగునున్న ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అందిస్తున్న రివార్డు కంటే 10 శాతం అధికంగా నగదు అందిస్తామని ఒడిశాలోని మోహన్ దాస్ మాంజీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన మరునాడే 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
రానున్న రోజుల్లో మరింత మంది మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది.  2026, మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలతోపాటు పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు.. నిర్వహిస్తున్నారు. దాంతో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుని.. వందలాది మంది మావోయిస్టులు మరణించారు. భారీగా మావోయిస్టులను అరెస్ట్ చేశారు.

ఇప్పటికే వేలాది మంది మావోయిస్టులు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాల ఎదుట లొంగిపోయారు. తాజాగా ఒడిశా రాష్ట్రంలో సైతం భారీగా మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. అదీకాక లొంగిపోయి ప్రభుత్వం అందించే రివార్డు తీసుకుని జన జీవన స్రవంతిలో కలవడం ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మావోయిస్టులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.