లిబియా సైన్యాధిపతి ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ అంకారా సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విమాన సిబ్బంది సహా ఎనిమిది మంది మరణించినట్లు టర్కీ కమ్యూనికేషన్స్ చీఫ్ బుర్హానెటిన్ డ్యూరాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డస్సాల్ట్ ఫాల్కన్ జెట్ మంగళవారం (17:17 జిఎంటి) అంకారాలోని ఎసెన్‌బోగా విమానాశ్రయం నుండి ట్రిపోలీకి బయలుదేరింది.
బయలుదేరిన కొన్ని నిమిషాలకే (17:33) విద్యుత్ వైఫల్యం కారణంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితిని గురించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియజేంది. దీంతో విమానాన్ని తిరిగి ఎసెన్‌బోగా విమానాశ్రయానికి మళ్లించాలని ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి) సమాచారమిచ్చింది. విమానాశ్రయంలో ల్యాండింగ్ కోసం జెట్ ప్రయత్నిస్తుండగా రాడార్‌తో ఎటిసికి సంబంధాలు తెగిపోయాయి. కొన్ని నిమిషాల్లోనే జెట్ కూలిపోయిందని బుర్హానెటిన్ డ్యూరాన్ పేర్కొన్నారు.
“వారు టర్కీలోని అంకారా నగరం నుండి అధికారిక పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన ఒక విషాదకరమైన, బాధాకరమైన సంఘటన తర్వాత ఇది జరిగింది. ఈ తీవ్రమైన నష్టం దేశానికి, సైనిక సంస్థకు, ప్రజలందరికీ తీరని లోటు” అని లిబియా ప్రధానమంత్రి అబ్దుల్‌హమీద్ ద్బేబా ఒక ప్రకటనలో తెలిపారు.
రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో జరిగిన ఉన్నత స్థాయి రక్షణ చర్చల కోసం లిబియా ప్రతినిధి బృందం అంకారాలో ఉందని టర్కీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అల్-హద్దాద్ అంకారాలో టర్కీ రక్షణ మంత్రి యాసర్ గులర్, ఇతర అధికారులను కలిశారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
ఈ ప్రమాదంలో లిబియా భూతల దళాల అధిపతి జనరల్ అల్-ఫితౌరి గ్రైబిల్, సైనిక ఉత్పాదక సంస్థకు నాయకత్వం వహించిన బ్రిగేడియర్ జనరల్ మహమూద్ అల్-ఖతావి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సలహాదారు మహమ్మద్ అల్-అసావి దియాబ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ కార్యాలయంలో పనిచేస్తున్న సైనిక ఫోటోగ్రాఫర్ మహమ్మద్ ఒమర్ అహ్మద్ మహజూబ్ కూడా మరణించారు.
ప్రైవేట్ జెట్ అంకారాలోని హెమనా జిల్లాపై ఎగురుతున్నప్పుడు అత్యవసర ల్యాండింగ్ కోసం అభ్యర్థించిందని, ఆ తర్వాత కెసిక్కావాక్ గ్రామం సమీపంలో శిథిలాలను గుర్తించారని టర్కీ అంతర్గత మంత్రి అలీ పేర్కొన్నారు. సహాయక బృందాలు ప్రమాదస్థలికి చేరుకున్నాయని అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని తెలిపారు. ఈ ప్రమాదంలో తమ దేశ సైన్యాధిపతి మహమ్మద్ అలీ అహ్మద్ అల్-హద్దాద్ సహా నలుగురు సహచరులు మరణించారని లిబియా ప్రభుత్వం ధృవీకరించింది. లీజుకు తీసుకున్న ప్రైవేట్‌జెట్ మాల్టాలో రిజిస్టర్ అయ్యిందని, దర్యాప్తులో భాగంగా దాని యాజమాన్యం, ఇతర వివరాలను పరిశీలిస్తామని పేర్కొంది.

More Stories
హాదీ హత్య వెనుక యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు
అమెరికా నుండి వెళ్ళిపోతే రూ.2.68 లక్షల స్టైపెండ్
వంద ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా?