వంద ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా?

వంద ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా?

డ్రాగన్‌ దేశం తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. అంతేకాదు. ఆయుధ నియంత్రణ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ విషయమై ఆమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. కనీసం ఆయుధాల నియంత్రణ చర్చలకు కూడా చైనా ఎలాంటి ఆసక్తి చూపడం లేదని అమెరికా ఆరోపిస్తోంది.  ఇదిలా ఉండగా కొత్తగా మూడు వేర్వేరు ప్రాంతాల్లో 100 ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను మోహరించి ఉండొచ్చని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. 

మరే అణుశక్తి దేశం చేయనివిధంగా డ్రాగన్‌ ఆయుధాలు సమకూర్చుకుంటోందని, అణు, సైనికపరమైన మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటుచేస్తోందని ఆరోపించింది.   మంగోలియాతో ఉన్న సరిహద్దు సమీపంలో మూడు సిలో ఫీల్డ్స్‌ (విశాలంగా ఉండే పొడవైన నిర్మాణం)లో 100 వరకు ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను మోహరించిందన్న అనుమానాన్ని అమెరికా వెల్లడించింది. ఈ సిలో సైట్ల గురించి గతంలోనే వెల్లడించినప్పటికీ.. అప్పుడు అక్కడ మోహరించిన క్షిపణుల సంఖ్యను ప్రస్తావించలేదు. 

2024లో చైనా వద్ద అణువార్‌హెడ్‌ల సంఖ్య కేవలం 600ల వరకు మించి లేవని, 2030 నాటికి ఆ సంఖ్య 1000 దాటిందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఆయుధ నియంత్రణ చర్చల విషయంలో చైనా ఎలాంటి ఆసక్తి చూపించడం లేదు’’ అని అమెరికా నివేదిక పేర్కొంది. అయితే అమెరికా ఆరోపణలతో కూడిన అంచనాలను చైనా తోసిపుచ్చింది. 

తన దేశాన్ని కించపర్చడానికి, అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు అమెరికా ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న తప్పుడు ప్రచారమని వాషింగ్టన్‌లోని చైనా దౌత్య కార్యాలయం నిప్పులు చెరిగింది. తన దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని కనీస స్థాయిలో మోహరింపులు కొనసాగించడం సహాజమని స్పష్టం చేసింది.