క‌క్ష్య‌లోకి బ్లూబ‌ర్డ్ బ్లాక్‌-2 ఉపగ్రహం

క‌క్ష్య‌లోకి బ్లూబ‌ర్డ్ బ్లాక్‌-2 ఉపగ్రహం

* ఎల్వీఎం3-ఎం6 మిష‌న్ విజ‌య‌వంతం

క‌మ‌ర్షియ‌ల్ మిష‌న్‌ను ఇస్రో విజ‌య‌వంతంగా నిర్వహించింది. బుధవారం ఉద‌యం అమెరికాకు చెందిన క‌మ్యూనికేష‌న్ శాటిలైట్ బ్లూబ‌ర్డ్ బ్లాక్‌-2(బాహుబలి రాకెట్ అని కూడా పిలుస్తారు)ను విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టారు. ఎల్‌వీఎం3-ఎం6 భారీ రాకెట్ ద్వారా ఆ ఉప‌గ్ర‌హాన్ని నింగిలోకి పంపారు. 24 గంట‌ల కౌంట్‌డౌన్ ముగియ‌గానే ఇవాళ ఉద‌యం ఉద‌యం 8.55 నిమిషాల‌కు ఎల్వీఎం3 రాకెట్ దూసుకెళ్లింది. 

 
ఆ రాకెట్ సుమారు 43.5 మీట‌ర్ల పొడుగు ఉన్న‌ది. దానికి ఎస్200 సాలిడ్ బూస్ట‌ర్లు ఉన్నాయి. శ్రీహ‌రికోట‌లోని రెండోవ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని ప్ర‌యోగించారు. అంత‌రిక్ష కేంద్రం నుంచి ఎగిరిన‌ సుమారు 15 నిమిషాల త‌ర్వాత శాటిలైట్ విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లోకి ప్ర‌వేశించింది. సుమారు 520 కిలోమీట‌ర్ల ఎత్తులో ఆ క‌క్ష్య ఉన్న‌ట్లు ఇస్రో చెప్పింది.  న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌(ఎన్ఎస్ఐఎల్‌), అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్‌మొబైల్ మ‌ధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా బ్లూబ‌ర్డ్ శాటిలైట్‌ను ప్ర‌యోగించారు.
లో ఎర్త్ ఆర్బిట్‌లో బ్లూబ‌ర్డ్ శాటిలైట్ విహ‌రించ‌నున్న‌ది. మొబైల్ స‌ర్వీసులు అందించేదుకు ఈ శాటిలైట్‌ను ప్ర‌యోగించారు. 4జీ, 5జీ వాయిస్, వీడియో కాల్స్‌, టెక్‌స్ట్‌లు, స్ట్రీమింగ్, డేటా ఎప్పుడైనా, ఎక్క‌డైనా ఈ శాటిలైట్ ద్వారా అందించ‌నున్నారు. లో ఎర్త్ ఆర్బిట్‌లో మోహ‌రించిన అతిపెద్ద క‌మ‌ర్షియ‌ల్ క‌మ్యూనిషేన్ శాటిలైట్‌గా దీన్ని గుర్తిస్తున్నారు.

విజ‌య‌వంతంగా శాటిలైట్ ప‌రీక్ష చేప‌ట్టిన ఇస్రో బృందంపై కేంద్ర మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ ప్ర‌శంసలు కురిపించారు. ప్ర‌ధాని మోదీ విజ‌న్‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తున్నార‌ని ఇస్రోను మెచ్చుకున్నారు. ఒక విజ‌యం త‌ర్వాత మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేస్తూ అంత‌రిక్ష టెక్నాల‌జీ రంగంలో భార‌త సామ‌ర్థ్యాన్ని చాటుతున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు. ఇది కేవలం ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపిన ఘటన మాత్రమే కాదు. ఇది అంతరిక్ష వాణిజ్య మార్కెట్‌లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని చాటి చెప్పిన చారిత్రాత్మక ఘట్టం.

ఈ మిషన్‌తో  ఎల్‌వీఎం3 మరో చరిత్ర సృష్టించింది. భారత గడ్డపై నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన వాణిజ్య పేలోడ్‌ను మోసుకెళ్లిన రాకెట్గా ఇది రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, ఇప్పటివరకు 100 శాతం విజయ రేటు కొనసాగిస్తూ,  ఎల్‌వీఎం3 ప్రపంచంలోని అత్యంత నమ్మకమైన హెవీ-లిఫ్ట్ లాంచ్ వాహనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది ఇస్రో సాంకేతిక ప్రమాణాలపై అంతర్జాతీయ స్థాయిలో ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ఇస్రో ఇప్పటివరకు ప్రయోగించిన అత్యంత బరువైన వాణిజ్య ఉపగ్రహంగా నిలిచింది.

ఈ ఉపగ్రహం ద్వారా సాధారణ 4జి/5జి స్మార్ట్‌ఫోన్లకే నేరుగా అంతరిక్షం నుంచే సిగ్నల్స్ అందుతాయి. సెల్ టవర్లు లేని అడవులు, పర్వత ప్రాంతాలు, సముద్ర మధ్య ప్రాంతాల్లో కూడా కాల్స్, డేటా సేవలు అందే అవకాశం ఏర్పడుతుంది. ఒక్కో కవరేజ్ సెల్‌కు 120 ఎంబిపిహెచ్ వరకు పీక్ డేటా స్పీడ్ అందించగల సామర్థ్యం ఈ ఉపగ్రహాన్ని నిజమైన కమ్యూనికేషన్ విప్లవానికి ప్రతీకగా నిలబెడుతోంది.

ఈ బ్లూబర్డ్-6 ఉపగ్రహం భారతదేశం, అమెరికా మధ్య అంతర్జాతీయ సహకారాన్ని సూచిస్తుంది. ఇది ఉపగ్రహ ఆవిష్కరణ, కనెక్టివిటీ, విస్తరణ, భాగస్వామ్యాలలో ఒక ప్రధాన మైలురాయిని హైలైట్ చేస్తుంది.