* బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఢిల్లీలో భారీ నిరసన చేపట్టారు. బంగ్లాదేశ్ హైకమిషనర్ కార్యాలయం వద్దకు వందలాది మంది తరలివచ్చి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టి బారికేడ్లు తోసుకుంటూ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు పరిషత్ శ్రేణులు యత్నించాయి. వారిని పోలీసులు నిలువరించారు.
ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత హిందువులపై దాడులు పెరిగాయని వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలు మండిపడ్డారు. ఈ నెల 18న హిందూ యువకుడు దీపూ చంద్రదాస్‌ను దుండగులు దారుణంగా హత్య చేశారని గుర్తుచేశారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలకు రక్షణ కల్పించడంలో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని వీహెచ్‌పీ కార్యకర్తలు విమర్శించారు.
బంగ్లాదేశ్‌లో మైనార్టీలకు రక్షణ కల్పించేందుకు మోదీ సర్కార్ చర్యలు చేపట్టాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనలతో హైకమిషన్ కార్యాలయం వద్ద పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు పెద్ద ఎత్తున పారామిలిటరీ బలగాలను మోహరించారు. వీహెచ్‌పీ కార్యకర్తలు కార్యాలయం లోపలికి వెళ్లకుండా నిలువరించారు. అనంతరం వీహెచ్‌పీ నాయకులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
వీహెచ్‌పీ ఆందోళనకు పిలుపునివ్వడంతో బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ముందుస్తుగానే భారీ భద్రతను కల్పించారు. పోలీసులు, పారామిలటరీ బలగాలను అక్కడ మోహరించారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతోన్న దాడులు, హింసకు వ్యతిరేకంగా హిందూ జాగరణ్ మంచ్, విశ్వహిందూ పరిషత్‌లు ఆ దేశ వీసా అప్లికేషన్ సెంటర్ వద్ద సోమవారం నిరసనలు చేపట్టారు.
రెండు అంచెల్లో బారికేడ్లను ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ముందుగానే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంటూ చర్యలు తీసుకున్నాయి. ఢిల్లీ ఆందోళనలో సర్వ భారతీయ హిందీ బెంగాలీ సంగతన్, వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ సభ్యులు పాల్గొన్నారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ సౌత్ క్యాంపస్ మెట్రో స్టేషన్ వద్ద బంగ్లాదేశ్‌లో హిందువులు, వారి భద్రతపై నినాదాలు చేశారు. ‘భారత్ మాతా కీ జై’, ‘యూనస్ సర్కారు హోష్ మే ఆవో’, ‘హిందూ హత్యలు బంద్ కరో’ అంటూ నినదించారు.
ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌లోని ఇండియన్ హై కమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ సమన్లు జారీ చేసింది. సిల్లీ, సిలిగుడిలోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాలపై దాడులు జరిగాయన్న వార్తల నేపథ్యంలో భారత హైకమిషనర్‌ను ఆ దేశ విదేశాంగ శాఖ పిలిపించింది. భారత్‌లో జరుగుతున్న పరిణామాలపై అసహనం వ్యక్తం చేసింది.
ఎంబసీ అధికారులు, సిబ్బందిని బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. దీన్ని దౌత్య సిబ్బంది భద్రతకు ముప్పుగానే కాకుండా, ఇరు దేశాల పరస్పర గౌరవం, శాంతి, సహనం, విలువలపై దాడిగా పరిగణిస్తామని బంగ్లా విదేశాంగ శాఖ పేర్కొంది.

More Stories
రూ.8.10 కోట్ల సైబర్ మోసంతో రిటైర్డ్ ఐపీఎస్ ఆత్మహత్యాయత్నం
ఫిబ్రవరి ఎన్నికలపై బంగ్లాదేశ్‌లో భారత్ వ్యతిరేక ధోరణి, హింస నీలినీడలు!
2013లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టుల దాడిలో సొంత పార్టీ వారి పాత్ర!