‘వికసిత్ భారత్ 2047’లో వాణిజ్య ఒప్పందాలు కీలకం

‘వికసిత్ భారత్ 2047’లో  వాణిజ్య ఒప్పందాలు కీలకం
 

2047 నాటికి వికసిత్ భారత్ గా అవతరించాలన్న భారత దేశ లక్ష్యంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏలు), సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలు (సీఈపీఏలు) కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు దేశాలకు పరస్పర ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు.

“గణనీయమైన ఆదాయాలు కలిగిన దేశాలతో వ్యూహాత్మకంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలపై చర్చలు వికసిత్ భారత్ 2047 కోసం దేశ దార్శనికతలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వ్యవసాయం, సేవల రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ను అగ్రగామిగా మార్చడానికి ప్రధాని మోదీ దృష్టి సారించిన విధానం బాగుంది” అని చెప్పారు. 

“మోదీ మార్గదర్శకత్వంలో మేము స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నాం. గత నాలుగేళ్లలో మోదీ నాయకత్వంలో ఇది ఏడో ఎఫ్ టీఏ. మోదీ హయాంలో అన్ని ఎఫ్టీఏలు భారత్తో పోటీ లేని దేశాలతో కుదిరాయి. కానీ ఆయా దేశాలు భారత్ అభివృద్ధి చెందడానికి అవకాశాలను అందిస్తున్నాయి.” అని పీయూష్ గోయల్ వివరించారు.

ప్రస్తుతం పెరుగుతున్న రక్షణాత్మక ప్రపంచంలో భారత్ ఎక్కువగా వాణిజ్యం చేస్తోందని, అందుకే ఎఫ్టీఏలను కుదుర్చుకుంటోందని ఆయన  వెల్లడించారు. ఫలితంగా ఎగుమతులు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ ఒప్పందాలు భారతీయ రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈల అభివృద్ధికి దారితీస్తాయని అభిప్రాయపడ్డారు. 

 
న్యూజిలాండ్తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరుదేశాలకు ప్రయోజనకరమని చెబుతూ దీనిపై సంతకం చేస్తున్నప్పుడు తాము దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాడి పరిశ్రమ, ఎంఎస్ఎంఈ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఇతరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్నామని తెలిపారు.

“న్యూజిల్యాండ్ తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా భారతీయ రైతులు మార్కెట్ యాక్సెస్, సాంకేతిక సహకారం ద్వారా గణనీయంగా లాభపడతారు. ఉన్నత చదువుల కోసం న్యూజిలాండ్‌కు వెళ్లే భారతీయ విద్యార్థులు ఇప్పుడు రెండేళ్ల వర్క్ వీసాకు అర్హులు. ఇండియా- న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఎఫ్టీఏ విద్యార్థులు, వృత్తి రంగ నిపుణులకు గొప్ప మార్గాలను అన్వేషిస్తుంది” అని కేంద్ర మంత్రి వివరించారు. 

విద్య, ఉపాధికి మెరుగైన అవకాశాలను అందిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ (స్టెమ్) బ్యాచిలర్ గ్రాడ్యుయేట్లకు, మాస్టర్స్ గ్రాడ్యుయేట్లు మూడేళ్ల వరకు, డాక్టరేట్ హోల్డర్లు నాలుగు సంవత్సరాల వర్క్ వీసాకు అర్హులు అవుతారని పీయూష్ గోయల్ తెలిపారు.