మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అక్రమ కోడైన్ దగ్గు సిరప్ వ్యాపారంతో సమాజ్‌వాదీ పార్టీకి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదని, సరైన సమయంలో బుల్డోజర్ చర్యలు తీసుకుంటామని సోమవారం స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కొడైన్ దగ్గు మందుపై వేసిన ఓ ప్రశ్నకు సీఎం యోగి ఆదిత్యనాథ్ బదులిస్తూ దేశంలో ఇద్దరు నమోనా వ్యక్తలు ఉన్నారని, ఒకరు ఢిల్లీ, ఒకరు లక్నోలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ ఇద్దరూ చర్చలు జరుగుతున్న సమయంలో దేశం విడిచి వెళ్తారని యోగి ఆరోపించారు. ఆయన తన వ్యాఖ్యల్లో పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్‌ను ఉద్దేశించినట్లుగా ఉన్నది.
విధానసభలో సీఎం యోగి చేసిన వ్యాఖ్యలకు సమాజ్‌వాదీ నేత అఖిలేశ్ తన ఎక్స్ అకౌంట్లో కౌంటర్ ఇస్తూ బీజేపీలో అంతర్గతంగా సమస్యలు ఉన్నాయని, లక్నోలో ఉన్న యోగి, ఢిల్లీలో ఉన్న ప్రధాని మోదీ మధ్య సఖ్యత సరిగా లేదని, ఆ విషయాన్ని సీఎం యోగి తన వ్యాఖ్యల్లో చెప్పినట్లు ఆరోపించారు. “స్వీయ అంగీకారం! ఢిల్లీ-లక్నో పోరు ఈ స్థాయికి చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదు. రాజ్యాంగ పదవులలో ఉన్నవారు కనీసం కొంత మర్యాదను పాటించాలి. హుందాతనం హద్దులు దాటకూడదు,” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
వందల కోట్ల దగ్గుమందు వ్యాపారం జరిగిందని, వందల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. అయితే ఆ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ఈ విషయంలో ఇప్పటివరకు 78 మందిని అరెస్టు చేశామని, 134 చోట్ల దాడులు నిర్వహించామని ఆదిత్యనాథ్ తెలిపారు.
ఈ కేసులో పాలుపంచుకున్న వారు సమాజ్‌వాదీ పార్టీకి చెందినవారేనని ఆయన ఆరోపించారు.
“వారు కోడైన్ దగ్గు సిరప్ గురించి సమస్యను లేవనెత్తారు. ఉత్తరప్రదేశ్‌లో కోడైన్ దగ్గు సిరప్ ఉత్పత్తి జరగదు. దీని ఉత్పత్తి మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలో జరుగుతుంది. దీని కారణంగా ఇతర రాష్ట్రాల్లో మరణాలు సంభవించాయి. ఈ మొత్తం వ్యవహారం అక్రమ మళ్లింపుకు సంబంధించినది,” అని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని ముఖ్యమంత్రి హితవు చెప్పారు. 2012 నుండి 2017 వరకు ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పుడు యాదవ్ పార్టీ చాలా అక్రమ కార్యకలాపాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. అంతకుముందు రోజు, ప్రతిపక్షాలు నినాదాలు చేస్తూ దగ్గు సిరప్ సమస్యపై చర్చకు డిమాండ్ చేశాయి. దీనిని స్పీకర్ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
ప్రశ్నోత్తరాల సమయంలో, ఎస్పీ ఎమ్మెల్యే అతుల్ ప్రధాన్ ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించి, ఈ కేసులో నిందితులపై ప్రభుత్వం చర్య తీసుకుంతారా? అని అడిగారు. “ఈ వ్యాపారం, ఈ అవినీతి మూలాలు అధికారంలో ఉన్నవారు రక్షిస్తున్న వారి చేతుల్లోనే ఉన్నాయి,” అని ఆయన ఆరోపించారు. “మన పొరుగు రాష్ట్రంలో చేస్తున్నట్లుగా, ప్రభుత్వం ఎన్డిపిఎస్ చట్టం కింద చర్య తీసుకుంటుందా? అని ప్రశ్నించారు.
ఎస్పీ సభ్యుడికి సమాధానమిస్తూ ఆదిత్యనాథ్ ఇలా అన్నారు, “మొదటగా, కోడైన్ సిరప్ కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఒక్క మరణం కూడా సంభవించలేదు. రెండవది, ఎన్డిపిఎస్ చట్టం కింద చర్యలు తీసుకుంటామని యూపీ ప్రభుత్వం కోర్టులో కేసు గెలిచింది. మూడవది, ఈ కేసులో ఎస్టిఎఫ్ [స్పెషల్ టాస్క్ ఫోర్స్] పట్టుకున్న అతిపెద్ద హోల్‌సేలర్‌కు 2016లో సమాజ్‌వాదీ పార్టీ లైసెన్స్ ఇచ్చింది.”
“ఇది కల్తీ కేసు కాదు, దారి మళ్లింపు కేసు. దీని కింద ఘజియాబాద్, సహారన్పూర్, వారణాసి, లక్నో, కాన్పూర్‌కు చెందిన హోల్‌సేలర్లు ఎలాంటి వైద్య సలహా లేకుండా దుర్వినియోగం కోసం ఇతర రాష్ట్రాలకు పంపారు. మీరు చదువుకోకుండా కేవలం అరుస్తారు,” అని ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు.

More Stories
ఫిబ్రవరి ఎన్నికలపై బంగ్లాదేశ్‌లో భారత్ వ్యతిరేక ధోరణి, హింస నీలినీడలు!
2013లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టుల దాడిలో సొంత పార్టీ వారి పాత్ర!
గ్రామీణ పేదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల కుట్రలు