మాస్కోలో సోమవారం జరిగిన కారు బాంబు దాడిలో రష్యన్ జనరల్ మరణించారని రష్యా దర్యాప్తు కమిటీ తెలిపింది.రష్యన్ సాయుధ దళాల జనరల్ స్టాప్‌కి చెందిన ఆపరేషనల్ ట్రైనింగ్ డైరెక్టరేట్ అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ ఫనిల్ సర్వరోవ్ మరణించారని రష్యా దర్యాప్తు కమిటీ అధికారిక ప్రతినిధి స్వెత్లానా పెట్రెంకో తెలిపారు. హత్యపై పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, ఉక్రెయిన్ నిఘా వర్గాలు ఈ దాడికి పాల్పడి వుండవచ్చని అనుమానిస్తున్నట్లు పెట్రెంకో వెల్లడించారు.
ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు బాంబు అమర్చి ఉంటుందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నాయని చెప్పారు. 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై సైనిక చర్యలు చేపట్టినప్పటి నుండి రష్యా, రష్యానియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ ప్రాంతాల్లోని రష్యన్ సైనిక అధికారులు, మద్దతుదారుల లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేపడుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాస్కో సమీపంలో జరిగిన కారు పేలుడులో జనరల్ స్టాఫ్ ఆఫ్ డిప్యూటీ జనరల్ యారోస్లావ్ మరణించిన సంగతి తెలిసిందే.
2024 డిసెంబర్‌లో, మాస్కోలో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలుడులో రష్యన్ రేడియోలాజికల్, కెమికల్ మరియు బయోలాజికల్ డిఫెన్స్ దళాల హెడ్ ఇగోర్ కిరిల్లోవ్ మరణించారు. ఉక్రెయిన్‌కి చెందిన ఎస్‌బియు సెక్యూరిటీ సర్వీస్ ఈ దాడికి పాల్పడిందని ఆవర్గాలు పేర్కొన్నాయి. 2023 ఏప్రిల్‌లో సెయింట్ పీటర్స్‌బర్గ్ కేఫ్‌లో ఒక విగ్రహం పేలడంతో రష్యన్ మిలటరీ బ్లాగర్ మాగ్జిమ్ ఫోమిన్ మరణించారు. 2022 ఆగస్టులో కారుబాంబు దాడిలో ప్రముఖ సిద్ధాంత కర్త అలెగ్జాండర్ డుగిన్ కుమార్తె డారియా డుగినా మరణించారు.
మరోవంక, ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో రెండు నౌకలు దెబ్బతిన్నట్లు రష్యా అధికారులు తెలిపారు. డ్రోన్ దాడిలో రెండు పిల్లర్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, నౌకల్లో మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. రష్యాలోని క్రాస్నోడార్ ప్రాంతంలోని నల్లసముద్ర తీరంలో ఉన్న వోల్నా గ్రామంపై ఉక్రెయిన్ డ్రోన్‌లతో విరుచుకుపడిందని క్రాస్నోడార్ ప్రాంతానికి చెందిన కార్యనిర్వాహక ప్రధాన కార్యాలయం టెలిగ్రామ్ యాప్‌లో పేర్కొంది.
నల్లసముద్రంలోని వోల్నా టెర్మినల్ వద్ద ఉన్న నౌకల్లోని సిబ్బందిని సురక్షితంగా ఖాళీ చేయించామని తెలిపింది. డ్రోన్ దాడితో 1,500 చదరపు మీటర్ల వరకు మంటలు వ్యాపించాయని, స్థానిక కాలమానం 2.00 గంటలకు కూడా మంటలు అదుపులోకి రాలేదని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ తరచుగా క్రాస్నోడార్ ప్రాంతంపై విరుచుకుపడుతోందని రష్యా ఆర్మీ తెలిపింది. శుద్ధి కర్మాగారాలు, ఇంధన గిడ్డంగులు, ఓడరేవులు మరియు వైమానిక స్థావరాలను లక్ష్యంగా డ్రోన్లతో దాడి చేస్తోందని పేర్కొంది.
నల్లసముద్ర ప్రాంతం రష్యా ఇంధన ఎగుమతులు మరియు సైనిక వ్యూహాలకు ముఖ్యమైన కేంద్రంగా ఉంది. క్రిమియా సరిహద్దులో, దక్షిణ ఉక్రెయిన్‌లోని డ్రోన్ పరిధిలో ఉంది. నల్లసముద్ర ప్రాంతంలోని వోల్నా గ్రామం రష్యాకు కీలకం. ఇది 2014లో ఉక్రెయిన్ నుండి విలీనం చేయబడిన క్రిమియన్ ద్వీపకల్పానికి ప్రధాన భూభాగాన్ని అనుసంధానిస్తుండటంతో పాటు కెర్చ్ జలసంధిపై ఉన్న క్రిమియన్ వంతెనకు దగ్గరగా కూడా ఉంటుంది.

More Stories
2013లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టుల దాడిలో సొంత పార్టీ వారి పాత్ర!
గ్రామీణ పేదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల కుట్రలు
అక్రమ కోడైన్ దగ్గు సిరప్ వ్యాపారంతో ఎస్పీకి సంబంధం!