రేవంత్ రెడ్డికి సవాల్ గా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రేవంత్ రెడ్డికి సవాల్ గా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
పంచాయతీ ఎన్నికల్లో 66% గెలిచామని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు పార్టీ అధిష్ఠానం వద్ద మాత్రం చెల్లుబాటు కావడం లేదు. నిత్యం తనపై విమర్శలు కురిపిస్తున్న ఓ ఎమ్యెల్యేపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరితే, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని పార్టీ అధినేత రాహుల్ గాంధీ సిఫార్సు చేయడంతో మింగుడు పడటం లేదు. 
 
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆదేశించినట్టు చెబుతున్నారు. ‘ఆయనకు మనం మంత్రి పదవి హామీ ఇచ్చాం. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలప్పుడు పార్టీ గెలుపునకు సహకరించారు’ అని రాహుల్‌ గుర్తుచేసినట్టు సమాచారం. సామాజిక సమీకరణాలను సమీక్షించి, వీలైనంత త్వరలో రాజగోపాల్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు రాహుల్‌ సూచించినట్టు తెలిసింది.
రెండో పర్యాయం జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు బెర్తు ఖాయమని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భావించారు. ఆ మేరకు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి సంకేతాలు అందటంతో ఆయన సన్నిహితులు ఫ్లెక్సీలు, దండలు, బ్యాండ్‌బాజాలు సిద్ధం చేసుకున్నారు. కానీ అదే సమయంలో ఆ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి అడ్డు తగులుతూ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి లేఖ రాశారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి ఈ లేఖ రాయించారని రాజగోపాల్‌రెడ్డి అనేక సందర్భాల్లో తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. 
 
ఇక అప్పటినుంచి ఆయన నేరుగా సీఎం రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదునైన విమర్శలు చేయడం ప్రారంభించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్‌రెడ్డి నిరంతరం విమర్శనాస్ర్తాలు సంధిస్తున్న నేపథ్యంలో రాజగోపాల్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 
 
రాజగోపాల్‌రెడ్డి సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆడియోలు, వీడియో క్లిప్పింగులు, పత్రికా వార్తలను సేకరించి ఏఐసీసీకి పంపినట్టు సమాచారం. తమకు అనుకూలంగా ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ద్వారా రాజగోపాల్‌రెడ్డి మీద క్రమశిక్షణ చర్యలకు ఒత్తిడి చేయించినట్టు తెలిసింది. ఈ విజ్ఞప్తుల మేరకు కేసీ వేణుగోపాల్‌ ఒక నివేదిక రూపొందించి రాహుల్‌గాంధీ వద్దకు తీసుకువెళ్లగా మొత్తం ఎదురు తిరిగున్నట్లయింది.