2013లో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలను బలితీసుకున్న ఛత్తీస్‌గఢ్ లోని జీరం లోయలో జరిగిన దారుణమైన మావోయిస్టుల దాడికి కొందరు సొంతపార్టీ వారే సహకరించారని కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా సంచలన ఆరోపణలు చేశారు. అయితే, నడ్డా ఆ ఆరోపిత కుట్ర గురించి వివరాలు, ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదు.
2013 మే 25న, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బస్తర్ జిల్లాలోని జీరం లోయలో కాంగ్రెస్ పార్టీ ‘పరివర్తన్ ర్యాలీ’ సందర్భంగా ఆ పార్టీ నాయకుల కాన్వాయ్‌పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నంద్ కుమార్ పటేల్, మాజీ ప్రతిపక్ష నాయకుడు మహేంద్ర కర్మ, మాజీ కేంద్ర మంత్రి విద్యాచరణ్ శుక్లా సహా 32 మంది మరణించారు.
ఆ సమయంలో ఛత్తీస్‌గఢ్‌కు బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నందున, తాను దానికి సంబంధించిన పరిణామాలను దగ్గరగా చూశానని నడ్డా తెలిపారు. “నేను జీరం లోయ ఘటనకు సంబంధించిన పరిణామాలను చూశాను. ఈ రోజు నేను చాలా బాధ్యతతో చెప్పదలుచుకున్నదేమిటంటే, జీరం లోయ ఘటనకు సంబంధించిన సమాచారం, అంతర్గత వివరాలను బయటి వ్యక్తులు ఎవరూ అందించలేదు. తమ సొంత పార్టీ వారినే చంపించడంలో పాలుపంచుకుంటూ, నక్సలైట్లతో సంబంధాలు పెట్టుకున్నది ఆ పార్టీలోని వ్యక్తులే” అని ఆయన ఆయన స్పష్టం చేశారు.
విష్ణు దేవ్ సాయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ‘జనాదేశ్ పర్బ్’ (ప్రజా తీర్పు ఉత్సవం) కార్యక్రమంలో ప్రసంగిస్తూ, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మావోయిస్టులతో కుమ్మక్కయ్యాయని నడ్డా ఆరోపించారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని “డబుల్ ఇంజిన్” ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదాన్ని ధైర్యంగా ఎదుర్కొందని చెప్పారు.
గత రెండేళ్లలో ఛత్తీస్‌గఢ్‌లో 503 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఏడాది 284 మంది మావోయిస్టులు హతమయ్యారు, వీరిలో బస్తర్ ప్రాంతంలోనే 255 మంది ఉన్నారు. గత ఏడాది రాష్ట్రంలో 219 మంది మావోయిస్టులు మరణించారు, వీరిలో బస్తర్ ప్రాంతంలో 217 మంది ఉన్నారు. “గత రెండేళ్లలో దాదాపు 2,500 మంది నక్సలైట్లు లొంగిపోయారు, 1,853 మంది అరెస్టు అయ్యారు. హిడ్మా, బసవరాజు వంటి అగ్ర నాయకులను మట్టుబెట్టారు” అని నడ్డా గుర్తు చేశారు.
ప్రస్తుతం మావోయిస్టుల ప్రాబల్యం రాష్ట్రంలో కొన్ని గ్రామాలకు, చాల తక్కువ ప్రాంతానికే పరిమితమై ఉందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు మావోయిస్టులతో స్నేహం, అవగాహనను కొనసాగించాయని, అయితే ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ముప్పును అంతం చేయడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టిందని నడ్డా తెలిపారు.
గత భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, పరిపాలనలో జరిగిన అవినీతి, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం, బుజ్జగింపు విధానం వంటివి ప్రజలకు ఇంకా గుర్తున్నాయని ఆయన తెలిపారు. త రెండు సంవత్సరాల విష్ణు దేవ్ సాయి ప్రభుత్వ ‘రిపోర్ట్ కార్డు’ను హైలైట్ చేస్తూ, రైతులు, మహిళలు, యువత, కార్మికుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సున్నితమైన, ఫలితాల ఆధారిత నిర్ణయాలు తీసుకుందని కొనియాడారు.
దీని ప్రభావం క్షేత్ర స్థాయిలో స్పష్టంగా కనిపిస్తోందని చెబుతూ పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి నెలలోనే ప్రభుత్వం రైతులకు రూ. 3,700 కోట్లకు పైగా విడుదల చేసిందని, గత రెండు సంవత్సరాలలో వారికి రూ. 1.25 లక్షల కోట్ల విలువైన ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు జరిగాయని, ఇది ‘అన్నదాతల’ సంక్షేమం, గౌరవం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐదు లక్షల మందికి పైగా భూమిలేని వ్యవసాయ కూలీలకు ఒక్కొక్కరికి రూ. 10,000 సహాయం అందించడం ద్వారా వారి సామాజిక ఆర్థిక భద్రతను బలోపేతం చేశామని నడ్డా చెప్పారు.

More Stories
ఫిబ్రవరి ఎన్నికలపై బంగ్లాదేశ్‌లో భారత్ వ్యతిరేక ధోరణి, హింస నీలినీడలు!
గ్రామీణ పేదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల కుట్రలు
అక్రమ కోడైన్ దగ్గు సిరప్ వ్యాపారంతో ఎస్పీకి సంబంధం!