విద్య, ఆరోగ్యం అందరికీ, ప్రతిచోటా అందుబాటులో ఉండాలి

విద్య, ఆరోగ్యం అందరికీ, ప్రతిచోటా అందుబాటులో ఉండాలి
విద్య, ఆరోగ్యం రెండు ముఖ్యమైన మానవ అవసరాలు అని, అవి అందరికీ, ప్రతిచోటా అందుబాటులో ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు. చంద్రపూర్ లో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటూ  క్యాన్సర్ లేదా మరే ఇతర వ్యాధి అయినా జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుందని చెప్పారు.
 
క్యాన్సర్ అనేది రోగిని చంపడమే కాకుండా మొత్తం కుటుంబాన్ని నాశనం చేసే వ్యాధి అని ఆయన తెలిపారు. ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చినప్పుడు, అది మొత్తం ఇంటిని ఆక్రమిస్తుందని, చికిత్స ఖర్చుల ఆందోళన కుటుంబ సభ్యులను నిరాశపపరుస్తూ తీవ్ర మానసిక ప్రభావాన్ని కూడా చూపుతుందని చెప్పారు. ఈ విషయంలో, ప్రభుత్వం, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చికిత్స కోసం తీసుకున్న చొరవ ప్రశంసనీయం అని కొనియాడారు.
 
దేశవ్యాప్తంగా కనీసం 15 ప్రదేశాలలో ఇటువంటి ఆసుపత్రులు స్థాపించారని,  నాగ్‌పూర్‌లో పెద్ద క్యాన్సర్ ఆసుపత్రి కూడా ఉందని చెబుతూ చుట్టుపక్కల జిల్లాల నుండి వచ్చే రోగులకు చికిత్స చేయడానికి ఇటువంటి ఆసుపత్రులు సహాయపడతాయని డా. భగవత్ తెలిపారు. అయితే, రోగులు ఎల్లప్పుడూ ఆసుపత్రిని సందర్శించలేరని,, ఖర్చులను భరించలేరని, వారికి వసతి ఉండక పోవడంతో చికిత్స పొందడం కష్టతరం చేస్తాయని ఆయన చెప్పారు.
 
ఇటువంటి సవాళ్ల దృష్ట్యా, వివిధ ప్రదేశాలలో ఉప కేంద్రాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయం రోగులకు ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి, దానిని వికేంద్రీకరించడానికి ఇది ప్రభావవంతమైన అడుగు అని ఆయన కొనియాడారు. పండిట్ దీన్‌దయాళ్ చంద్రపూర్ క్యాన్సర్ హాస్పిటల్ చికిత్సకు బాధ్యత వహించిందని ఆయన పేర్కొన్నారు.
 
అయితే, చంద్రపూర్ నివాసితులుగా, ఇక్కడి ప్రజలు రోగులకు మానసిక బలాన్ని అందించడానికి, వారి కుటుంబాలను ఓదార్చడానికి, వారి బంధువులకు మద్దతు ఇవ్వడానికి కూడా చొరవ తీసుకోవాలని డా. భగవత్ సూచించారు. ఈ ప్రాజెక్ట్ చంద్రపూర్ జిల్లాకు విస్తృత ఖ్యాతిని తెస్తుంది కాబట్టి చంద్రపూర్ నివాసితులు ఆసుపత్రి సజావుగా పనిచేసేలా చూసుకోవాలని చెప్పారు. 
 
“దేవుడు మనకు మన శరీరాలను ఇచ్చాడు. మనం వాటిని సేవ కోసం ఉపయోగించాలి. దీనికి డబ్బు అవసరం లేదు, సమయం మాత్రమే అవసరం. మనకు చెందినవారనే భావనను పెంపొందించుకోవాలి. వైద్యులతో కలిసి రోగులకు సేవ చేయడం వల్ల కుటుంబ సభ్యుల బాధలు తొలగిపోతాయి, రోగులను స్వస్థపరుస్తాయి, జీవితం అర్థవంతంగా ఉందనే సంతృప్తిని ఇస్తాయి” అని డా. భగవత్ వివరించారు.
 
చంద్రపూర్‌లో ఆధునిక క్యాన్సర్ చికిత్సా కేంద్రం ప్రారంభించబడటం గర్వకారణమని చెబుతూ తాను కూడా చంద్రపూర్ నివాసిని అని గుర్తు చేసుకున్నారు. మారుమూల గ్రామాలు, నగరాల్లో పనిచేస్తున్న చంద్రపూర్ వైద్యులు ఈ ఆసుపత్రిలో పనిచేయడానికి సంతోషంగా ఉన్నట్లే, చంద్రపూర్ నివాసిగా తాను కూడా ఈ సౌకర్యం నిర్మాణంతో సంతోషంగా ఉన్నానని చెప్పారు.
టాటా ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ చైర్మన్ డాక్టర్ కైలాష్ శర్మ, పోలీస్ సూపరింటెండెంట్ సుదర్శన్ ముమ్మాక, డాక్టర్ అజయ్ చందన్‌వాలే, జిల్లా మేజిస్ట్రేట్ వినయ్ గౌడ కూడా పాల్గొన్నారు.