రేవంత్ రెడ్డి సర్కార్‌పై ధూప, దీప, నైవేద్యం (డీడీఎన్) పథకం అర్చకులు సమరభేరి మోగించారు. సోమవారం నుంచి జనవరి 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అర్చక చైతన్యయాత్ర నిర్వహిస్తామని డీడీఎన్‌ఎస్ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ తెలిపారు. ఈ నెల 22న నిజామాబాద్‌లో ప్రారంభమయ్యే యాత్ర 23న ఆదిలాబాద్, 24న వరంగల్, 26న కరీంనగర్, 27న మహబూబ్‌నగర్, 29న సంగారెడ్డి, జనవరి 2న నల్లగొండ, 5న రంగారెడ్డి, హైదరాబాద్, 6న ఖమ్మం వరకు సాగుతుందని వాసుదేవశర్మ వివరించారు.
పది ఉమ్మడి జిల్లాల్లో డీడీఎన్ అర్చకులతో సమావేశం అనంతరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. డీడీఎన్ పథకం అర్చకులకు ప్రభుత్వం కేటాయిస్తున్న గౌరవ వేతనం సరిపోవడంలేదని, దీంతో అర్చకులు దుర్భర జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వ హయాంలో అనేక దేవాలయాలను డీడీఎన్ పథకం కిందకు తీసుకొచ్చి దేవాలయాల పునరుజ్జీవనానికి కేసీఆర్ కృషిచేశారని, అయితే, రేవంత్ సర్కార్ మాత్రం ఉన్న వాటిని కొనసాగించడానికే చాలా ఇబ్బందులు పడుతున్నదని ధూప, దీప, నైవేద్యం అర్చకులు చెప్తున్నారు.
డీడీఎన్ వేతనాలు సరైన సమయానికి రాకపోవడంతో చాలామంది గ్రామీణ ప్రాంత అర్చకులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తమ సమస్యలపై పలుమార్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులను సంప్రదించినా పెద్దగా స్పందించలేదని, దీంతో సర్కార్‌పై అర్చక సమరభేరి మోగించాల్సి వస్తున్నదని డీడీఎన్ సంఘం ప్రతినిధులు తెలిపారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2007లో ధూప, దీప, నైవేద్య పథకం ద్వారా రాష్ట్రంలోని పురాతన ఆలయాలకు పునరుజ్జీవం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్.. ఈ పథకాన్ని మరింత విస్తృతపరిచి ఆలయాల్లో నిర్వహించే ధూప, దీప, నైవేద్యాలు కుంటుపడకుండా వారికి కావాల్సిన స్థాయిలో వేతనాలు అందించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,758 మంది అర్చకులు ఈ పథకం కింద విధులు నిర్వర్తిస్తున్నారు.

More Stories
రేవంత్ రెడ్డికి సవాల్ గా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
యువత క్రమశిక్షణాయత జీవితాన్ని అలవరచుకోవాలి
తెలంగాణలోనే తదుపరి ‘ఎస్ఐఆర్’