మహారాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి ఆదివారం 207 అధ్యక్ష పదవులను గెలుచుకుని భారీ విజయాన్ని సాధించింది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి కేవలం 44 స్థానాలకే పరిమితమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) గణాంకాల ప్రకారం, బీజేపీ 117 మున్సిపల్ అధ్యక్ష పదవులను, శివసేన 53, ఎన్సీపీ 37 పదవులను గెలుచుకున్నాయి.
కాంగ్రెస్ 28, ఎన్సీపీ (ఎస్పీ) ఏడు, శివసేన (యూబీటీ) తొమ్మిది స్థానాలను దక్కించుకున్నాయి. ఎస్‌ఈసీలో నమోదైన పార్టీలు నాలుగు స్థానాలను గెలుచుకోగా, 28 మున్సిపల్ అధ్యక్ష స్థానాలు గుర్తింపు లేని నమోదిత పార్టీలకు దక్కాయి. ఐదు స్థానాలను స్వతంత్రులు గెలుచుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి, దాని నేతృత్వంలోని మహా యుతి కూటమికి మద్దతు ఇచ్చిన మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల కేంద్రీకృత అభివృద్ధిపై వారికున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. “మహారాష్ట్ర అభివృద్ధికి గట్టిగా మద్దతుగా నిలుస్తోంది! మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ ఎన్నికలలో బీజేపీ, మహాయుతిని ఆశీర్వదించిన మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు” అని ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. “ఇది ప్రజల కేంద్రీకృత అభివృద్ధి అనే మా దార్శనికతపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడి ఆకాంక్షలను నెరవేర్చడానికి కొత్త శక్తితో పనిచేయడానికి మేము కట్టుబడి ఉన్నాము,” అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. “మహారాష్ట్ర నగర పంచాయతీ, నగర పరిషత్ ఎన్నికలలో మహాయుతికి అఖండ మద్దతు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు” అని ఆయన చెప్పారు. “ఈ విజయం మోదీజీ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్‌డిఎ కింద ప్రతి వర్గం సంక్షేమం కోసం ఉన్న దార్శనికతపై ప్రజల ఆశీర్వాదం” అని తెలిపారు.
మహాయుతి విజయాన్ని బీజేపీ, ప్రభుత్వం సామూహిక కృషిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అభివర్ణించారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తాము మరింత మెరుగ్గా రాణిస్తామని ఆయన భరోసా వ్యక్తం చేశారు. “ఇది సమిష్టి కృషి. మేము అభివృద్ధి నినాదంతో ఎన్నికలలో పోటీ చేశాము. నేను సానుకూల అభివృద్ధి ఎజెండాతో ప్రచారాన్ని నడిపాను. నేను ఒక్కసారి కూడా ఏ రాజకీయ నాయకుడిని గానీ, పార్టీని గానీ విమర్శించలేదు,” అని ఆయన గుర్తు చేశారు.
తాము అభివృద్ధి ఎజెండా, ఇప్పటివరకు చేసిన పనులు, భవిష్యత్తు కోసం తమ ప్రణాళిక ఆధారంగా ఓట్లు అడిగామని ఫడ్నవీస్ చెప్పారు. “మొదటిసారిగా, నేను 100 శాతం సానుకూల ఓట్లను అడిగాను. ప్రజలు మాకు 100 శాతం సానుకూల ఓట్లను ఇచ్చారు,” అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సిపి అధినేత అజిత్ పవార్ మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ ఎన్నికలలో పార్టీపై,దాని అభ్యర్థులపై విశ్వాసం ఉంచినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు, ఈ తీర్పును గర్వం, బాధ్యతతో కూడిన క్షణంగా అభివర్ణించారు.

More Stories
‘బాబ్రీ మసీదు’ నమూనా నిర్మాణం వెనుక రాజకీయ కుట్ర
మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిన మధ్య ప్రదేశ్
సెక్యులర్ పాట పాడాలంటూ బెంగాల్ సింగర్‌కు వేధింపులు