కర్ణాటకలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిన విద్వేష ప్రసంగాల బిల్లు–2025 తరహాలోనే, తెలంగాణలో కూడా సారూప్యమైన చట్టాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది. అటువంటి చట్టం వాస్తవానికి బీజేపీ కార్యకర్తలను, బీజేపీ నాయకులను వేధించడానికి, వారిని తిరగకుండా చేయడానికి, మాట్లాడకుండా నోరు మూయించడానికి మాత్రమే తీసుకువస్తున్న చట్టంగా భావిస్తున్నట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను తిట్టేవాళ్లకు మద్దతుగా బిల్లు తెస్తోందని, హిందువులపై, సనాతన ధర్మంపై విమర్శలు చేసే వారిని, హిందూ ధర్మాన్ని, దేవీదేవతలను హేళన చేసే వారిని కాపాడేందుకు ఈ బిల్లు తీసుకురావాలని ప్రయత్నిస్తోందని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. అందుకే బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.
ఈ చట్టం యొక్క అసలు లక్ష్యం హిందువులు ఏం మాట్లాడకుండా చేయడం, హిందూ ధర్మ స్వరాన్ని అణచివేయడమే అతను ఆయన ధ్వజమెత్తారు. “ముస్లిం ఈజ్ కాంగ్రెస్… కాంగ్రెస్ ఈజ్ ముస్లిం” అని మాట్లాడింది కూడా కాంగ్రెస్ నాయకులే అని ఆయన గుర్తు చేశారు. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూ దేవీదేవతలను హేళనగా, అసభ్యంగా మాట్లాడింది కూడా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి భాగస్వాములే అని ఆయన విమర్శించారు.
విద్వేష ప్రసంగాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, విద్వేషాన్ని పుట్టిస్తున్నది కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలే అని పేర్కొంటూ అలాంటి పార్టీ ఇప్పుడు విద్వేషాలకు వ్యతిరేకంగా హేట్ స్పీచ్ చట్టం తీసుకొస్తామంటూ మాట్లాడటం సిగ్గుచేటు అని రామచందర్ రావు దుయ్యబట్టారు. తెలంగాణలో రాజకీయాలు మారుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని పేర్కొంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని నెలల తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చారని, రాజకీయాల్లో మళ్లీ మార్పు వస్తుందని చెబుతున్నారని చెబుతూ కానీ తెలంగాణలో ఓటీపీ పాలిటిక్స్ నడవవని బిజెపి నేత స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని, ఫ్యూడలిజాన్ని, వారి పాలనా పనితీరును తెలంగాణ ప్రజలు స్పష్టంగా చూశారని ఆయన చెప్పారు. అందుకే బఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయారని తేల్చి చెప్పారు. కాబట్టి ఓటీపీ పాలిటిక్స్‌ను ప్రజలు నమ్మరని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఒక్క బీజేపీ పార్టీయే అని స్పష్టం చేశారు.
More Stories
యువత క్రమశిక్షణాయత జీవితాన్ని అలవరచుకోవాలి
తెలంగాణలోనే తదుపరి ‘ఎస్ఐఆర్’
మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్