అమెరికా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ప్రాచీన భారతీయ ఆధ్యాత్మికతకు, ఆధునిక రాజనీతికి వారధిగా నిలిచింది. రెండో ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి భారత్‌తో పాటు శ్రీలంక, మెక్సికో, నేపాల్, అండోరా వంటి దేశాల రాయబారులు హాజరయ్యారు.
ధ్యానం ద్వారా ప్రపంచ శాంతి, మానసిక ఆరోగ్య సవాళ్లను ఎలా ఎదుర్కోవచ్చు అనేది వారంతా చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ రవిశంకర్ నేతృత్వంలో జరిగిన మార్గనిర్దేశిత ధ్యానం అక్కడ ఉన్నవారికి ప్రశాంతతను కల్పించింది. ‘ప్రపంచ శాంతి, సమరసత కోసం ధ్యానం’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్. తన ప్రసంగం ద్వారా ధ్యానంకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు.
“ధ్యానం అనేది ఆలోచన ద్వారా తెలుసుకోవడం నుండి, మీరు తెలుసుకున్న దానిని అనుభూతి చెందడం వైపు చేసే ప్రయాణం. ధ్యానం చేయడానికి, మీరు మొదటగా అధిక ఆలోచనల నుండి ప్రస్తుతం ఉన్న వాస్తవాన్ని అనుభూతి చెందడం వైపు వెళ్లాలి. ఆ తర్వాత, ఆ అనుభూతిని దాటి అంతర్గత ప్రదేశం వైపు సాగాలి” అని సూచించారు.
“మీరు మానసికంగా స్థిరంగా, సున్నితంగా, వివేకవంతంగా ఉండాలనుకుంటే, మీరు ధ్యానం చేయాలి. ధ్యానం అంటే నిష్క్రియాత్మకంగా ఉండటం కాదు. అది మిమ్మల్ని మరింత చురుకుగా, ప్రశాంతంగా చేస్తుంది. విప్లవకారుడిగా ఉండటానికి కూడా, మీరు ధ్యానం చేయాలి” అని వివరించారు. ఐక్యరాజ్యసమితిలో ఉండే ప్రపంచ దేశాల దౌత్యవేత్తలు నిత్యం ఎదుర్కొనే ఒత్తిడిని అధిగమించడానికి సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ధ్యానం ఒక శక్తివంతమైన సాధనమని ఆయన పేర్కొన్నారు.
ఆ తర్వాత శ్రీ శ్రీ రవిశంకర్ నేతృత్వంలో జరిగిన 20 నిమిషాల ధ్యాన ప్రక్రియతో ఐక్యరాజ్యసమితి ప్రాంగణం నిశ్శబ్దానికి వేదికైంది. ఇలాంటి సంఘటన ఐక్యరాజ్యసమితిలో జరగడం చాలా అరుదు కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేత్తలతో పాటు శాస్త్రవేత్తలు, ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. బ్రహ్మ కుమారీస్ సంస్థ ప్రతినిధి బీకే మోహిని పంజాబీ.. యోగమాత ఫౌండేషన్ నుంచి యోగమాత కేకో ఐకావా, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త డా. జాన్ హాగెలిన్., మహర్షి ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన డా. రాబర్ట్ ష్నైడర్ వంటి వారు హాజరయ్యారు.
కాగా, డిసెంబర్ 21వ తేదీన జరగనున్న ప్రపంచ ధ్యాన దినోత్సవానికి ముందుగానే న్యూయార్క్‌లోని ఫేమస్ టైమ్స్ స్క్వేర్ ఇప్పటికే ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. “World Meditates with Gurudev” అంటూ భారీ బిల్ బోర్డులు అక్కడ వెలిశాయి. ఒక భారతీయ ఆధ్యాత్మిక నాయకుడికి అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న గౌరవానికి ఇది నిదర్శనమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఆదివారం రోజున గురుదేవ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందితో ప్రత్యక్షంగా ధ్యానం చేయించనున్నారు. భారతీయ నాగరిక వారసత్వమైన ధ్యానం.. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి వంటి అత్యున్నత వేదికలపై దౌత్యానికి, మానసిక శ్రేయస్సుకు మార్గదర్శిగా మారడం ప్రతీ భారతీయుడికి గర్వకారణంగా మారింది.

More Stories
ఆత్మసాక్షాత్కారానికి ప్రాథమిక మార్గం క్రియాయోగం
ఈశాన్య ప్రాంతాన్ని తూర్పు పాక్ తో కలిపేందుకు కాంగ్రెస్ కుట్ర
గౌహతిలో శ్రీవారి ఆలయంకు 25 ఎకరాల భూమి కేటాయింపు