హిందూ ఓ జీవన విధానం.. హిందువు అందరినీ కలుపుకొని పోయేవాడు!

హిందూ ఓ జీవన విధానం.. హిందువు అందరినీ కలుపుకొని పోయేవాడు!
హిందూ అనేది ఒక జీవన విధానానికి పేరని, భారతదేశంలో ఈ స్వభావాన్ని అనుసరించే లేదా విశ్వసించే ప్రతి ఒక్కరూ హిందువే అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. సంఘ్ శతాబ్ది సందర్భంగా  “సంఘ్ ప్రస్థానానికి 100 సంవత్సరాలు: “నూతన ప్రస్తావనలు” ప్రసంగాల శ్రేణిని కొలకత్తాలో  ఇస్తూ  ఈ భూమి వలనే మనం ఇలా మారాము కాబట్టి, ఇది హిందువుల భూమి అని తెలిపారు.  
 
ప్రపంచంలో ఆర్ఎస్ఎస్ ను పోల్చదగిన మరో సంస్థ లేదని స్పష్టం చేస్తూ  సంఘ్‌ను అర్థం చేసుకోవడానికి దానిని ఇతర సంస్థలతో పోల్చడం తప్పని  తేల్చి చెప్పారు. స్వయంసేవకులు గణవేశ్ (యూనిఫామ్)తో సంచాలన్ నిర్వహిస్తారని, కేవలం దీనిని చూసి దానిని పారామిలిటరీ సంస్థ అని పిలవడం సరికాదని,  స్వయంసేవకుల కవాతును పారామిలిటరీ సంస్థతో పోల్చడం తప్పుదోవ పట్టించేదిగా ఉంటుందని ఆయన తెలిపారు.  సంబంధంలేని వారు వ్యాప్తి చేసే తప్పుడు కథనాల ఆధారంగా కాకుండా, వాస్తవాల ఆధారంగా సంఘ్ గురించి ప్రజల అభిప్రాయాలు ఏర్పడాలని ఆయన సూచించారు.  
మనం సమాజాన్ని సంఘటితం చేయాలని, సమాజంలో మనం ఎలాంటి ప్రత్యేక సంస్థను సృష్టించాల్సిన అవసరం లేదని సర్ సంఘచాలక్ తెలిపారు. హిందూ అనేది ఒక పేరు కాదని, ఒక గుణం అని తెలిపారు. ఒకరి ఆరాధన లేదా భాష స్థానికమైనా లేదా విదేశీదైనా, ఈ సంస్కృతిని గౌరవించి, మాతృభూమిని పూజించే ప్రతి ఒక్కరూ హిందువే అని స్పష్టం చేశారు. 
 
“హిందువు అంటే అందరినీ కలుపుకొని పోయేవాడు, ఆహారపు అలవాట్లు, ఆరాధనా పద్ధతులు, వస్త్రధారణలో తేడాలు ఉన్నప్పటికీ, వసుధైవ కుటుంబకం స్ఫూర్తిని కలిగి ఉంటాడు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే నమ్మకంతో అందరి శ్రేయస్సును కోరుకుంటాడు. మనం మనలోకి చూసుకుని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కనుగొన్నాము” అని ఆయన వివరించారు. 
 
ఇండో- ఇరానియన్ పీఠభూమిపై నివసించే వారి డీఎన్ఏ 40,000 సంవత్సరాలుగా ఒకేలా ఉందని శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారని డా. భగవత్ గుర్తు చేశారు. ఈ మాతృభూమిపై నివసిస్తున్న ప్రజలు 40,000 సంవత్సరాలుగా ఒకే డీఎన్ఏను పంచుకుంటున్నారని చెబుతూ ఈ దృక్కోణం నుండి చూస్తే, భారతదేశంలో నివసించే ప్రజలు హిందువులని తేల్చి చెప్పారు.
 
“అయితే, కొందరు గర్వంగా “మేము హిందువులం” అని చెబుతారు. కొందరు “అలా చెప్పాల్సిన అవసరం ఏమిటి?” అని అంటారు. కొందరు దానిని నెమ్మదిగా గుసగుసలాడతారు, మరికొందరు తాము హిందువులమనే విషయాన్ని మర్చిపోయారు. ఈ ఆలోచన కేవలం సంఘ్ ది మాత్రమే కాదు; ఇది సనాతన (శాశ్వతమైన) భావన” అని డా. భగవత్ తెలిపారు. ఒక గంట పాటు మిగతావన్నీ మర్చిపోయి దేశం గురించి ఆలోచించడమే  సంఘ్ శాఖ సారాంశం అని తెలిపారు.
సంఘ్ స్వయంసేవకులు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రజలకు సేవ చేస్తారని, అయితే అంతమాత్రం చేత  దీనిని కేవలం సేవా సంస్థగా వర్ణించడం సరికాదని స్పష్టం చేశారు. సంఘ్‌కు శత్రువులు లేరని, కానీ దాని ఎదుగుదల వల్ల తమ స్వార్థ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లుతుందని భావించేవారు దానిని వ్యతిరేకిస్తూ, దాని గురించి అబద్ధాలు ప్రచారం చేస్తుంటారని డా. భగవత్ వివరించారు.
సంఘ్ ప్రారంభకులు డాక్టర్ హెడ్గేవార్‌ను డాక్టర్ కావడానికి కోల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీకి రాలేదని,  కానీ అనుశీలన్ సమితితో సంబంధాలు ఏర్పరచుకోవడానికి, పశ్చిమ భారతదేశంలో విప్లవాత్మక కార్యకలాపాలను ప్రారంభించడానికి ఆయనను పంపారని చెప్పారు. అనుశీలన్ సమితి సభ్యుడిగా కాళీమాత ముందు తీసుకున్న ప్రతిజ్ఞ ఫలితంగా డాక్టర్ హెడ్గేవార్ తన జీవితాంతం భారతమాత సేవకే అంకితమయ్యారని గుర్తు చేశారు. 
 
మనల్ని బానిసలుగా చేసిన మొదటివారు బ్రిటిష్ వారు కాదని, వారికి ముందు ఇస్లాం, అంతకు ముందు శకులు, అంతకు ముందు కుషాణులు, వారికి ముందు అలెగ్జాండర్, హూణులు వచ్చారని తెలిపారు. మన సమాజంలో విభేదాలు ఉన్నందున మన స్వాతంత్ర్యం నిలబడుతుందా? అని డాక్టర్ హెడ్గేవార్ ఆశ్చర్యపోయారని చెప్పారు. స్వాతంత్ర్యానికి ముందు, మన దేశాన్ని బ్రిటిష్ మరియు మొఘలులతో సహా ఎనిమిది మంది ఆక్రమణదారులు పాలించారని ఆయన గుర్తు చేశారు. 
 
పదేళ్ల ఆలోచన తర్వాత, డాక్టర్ హెడ్గేవార్ 1925లో విజయదశమి రోజున సంఘ్‌ను స్థాపించారని, అయితే ఎవ్వరికో పోటీగా లేదా వ్యతిరేకంగా కాకూండా, నిత్యం సమాజం కోసం పనిచేయాలనే ఆలోచనతో,  ఎవరినో నాశనం చేయడానికి కాకుండా  పరిపూర్ణ వ్యక్తిత్వం సమకూర్చే విధంగా సంఘ్ కార్యప్రణాళిక ఉంటుందని ఆయన వివరించారు.
దేశ దుస్థితిపై డాక్టర్ హెడ్గేవార్ తీవ్రమైన ఆవేదన, ఆందోళన నుండి సంఘ్ జన్మించిందని, అందువల్ల, మొత్తం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడమే ఆయన లక్ష్యం అని, ఇతరులను వ్యతిరేకించడం కాదని డా. భగవత్ తెలిపారు. 
బ్రిటిష్ వారి రాక తర్వాతే మనం ఒక దేశంగా మారామనే ఆలోచన తప్పని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం ప్రాచీన కాలం నుండి ఉందని, శ్రీ అరబిందో ఉత్తరపారా ప్రసంగంలోనే కాకుండా, కమ్యూనిస్టు నాయకుడు రజనీ పామ్ దత్ కూడా తన పుస్తకంలో ప్రజాస్వామ్యం, ఇలాంటి వ్యవస్థలు బ్రిటిష్ వారి వల్ల రాలేదని రాశారని ఆయన గుర్తు చేశారు.  వారు రాకపోయినా, మనం వేదాల సూత్రాల ఆధారంగా మనల్ని మనం పరిపాలించుకో గలిగేవాళ్ళమని చెప్పారు.
ఈ దేశానికి బాధ్యత వహించే సమాజం హిందూ సమాజం అని తేల్చి చెప్పారు.  ఒక దేశం విధి దాని సమాజ స్వభావం, నాణ్యత ద్వారా రూపుదిద్దుకుంటుందని డా. భగవత్ తెలిపారు. దీనిని సాధించడానికి, మనం ‘వ్యక్తి నిర్మాణ’పై పని చేయాలని, హిందూ సమాజాన్ని సంఘటితం చేసే ఈ లక్ష్యాన్ని సంఘ్ చేపట్టిందని ఆయన తెలిపారు.