మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్

మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్
మాజీ మావోయిస్టు, సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌ మండల కేంద్రంలో ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి నాలుగు వాహనాల్లో ఎన్‌ఐఏ అధికారులు వచ్చారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై సోదాలు చేపట్టిన ఎన్‌ఐఏ అధికారులు గాదె ఇన్నయ్యతో పాటు యూట్యూబ్‌ ఛానల్‌ పై కేసు నమోదు చేశారు.
 
ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్‌ వికల్ప్‌ అంత్యక్రియలకు గాదె ఇన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలతో గాదె ఇన్నయ్యను అరెస్టు చేశారు. ఉపా చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. కాతా రామచంద్రారెడ్డి సంస్మరణ సభలో మావోయిస్టులను ప్రోత్సహిస్తూ ప్రసంగించారని దర్యాప్తులో నిర్థారణ అయ్యింది. 

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత గాదె ఇన్నయ్య ఛత్తీష్‌గడ్ వెళ్లారు. హిడ్మా తల్లిని కలిశారు. అక్కడున్న మీడియాతో పాటు యూట్యూబ్ ఛానళ్లతో హిడ్మా మరణంపై ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ఈ సమయంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీరును తప్పుబట్టారు.  ఈ నేపథ్యంలోనే ఆయనపై ఎన్ఐఏ దృష్టి సారించింది. ఇప్పటికే చాలా సార్లు నోటీసులు పంపింది. తాజాగా, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఇన్నయ్యపై కేసు నమోదు చేసింది. కాగా, ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో 200 మంది అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు.