టికెట్ ధరలు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇవి డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తున్నట్టు ప్రకటించింది. సాధారణ తరగతి టికెట్ ధరలకు సంబంధించిన 215 కిలోమీటర్ల వరకు ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపింది. 215 కి.మీ. దాటితే ప్రతీ కిలోమీటరుకు పైసా చొప్పున పెరుగుతుంది. అలాగే, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని నాన్-ఏసి క్లాస్‌లకు, అన్ని రైళ్లలోని ఏసి క్లాస్‌లకు కి.మీకు 2పైసలు పెంచినట్లు పేర్కొంది.
లోకల్, స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని, ఆర్డినరీ క్లాస్‌లో 215 కి.మీ కంటే తక్కువ దూరం ప్రయాణానికి ఎటువంటి పెరుగుదల లేదని వెల్లడించింది. పెంచిన ధరలు డిసెంబర్ 26 నుండి అమల్లోకి రానున్నాయని తెలిపింది. ధరల పెంపుతో 2026 మార్చి 31వరకు రైల్వేకి సుమారు రూ.600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేసినట్లు రైల్వేశాఖ తెలిపింది.
2025 జులైలో, చార్జిల పెంపుతో ఇప్పటివరకు రూ.700 కోట్ల ఆదాయం వచ్చినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను సమతుల్యం చేస్తూనే, ఎక్కువ మందికి అందుబాటు ధరలో ఉంచడమే ఈ చర్య లక్ష్యమని అధికారులు తెలిపారు. సబర్బన్, తక్కువ దూరం ప్రయాణించే రైళ్ల టిక్కెట్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. సబర్బన్ రైలు సర్వీసులు లేదా నెలవారీ పాస్‌ల ధరలు పెరగబోవని వివరించారు.
కాగా, మానవవనరుల కోసం (ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు, పెన్షన్లు) ఏటా పెద్ద మొత్తంలో రైల్వే శాఖ ఖర్చు చేస్తోంది. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో రూ.2,63,000 కోట్లు ఖర్చు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలి సంవత్సరాలలో నిర్వహణ వ్యయాలు విపరీతంగా పెరిగాయని రైల్వేలు పేర్కొన్నాయి. మానవ వనరుల వ్యయం రూ. 1.15 లక్షల కోట్లకు పెరగగా, పెన్షన్ ఖర్చులు ఇప్పుడు రూ. 60,000 కోట్లకు చేరాయి.
రైల్వే నెట్‌వర్క్ విస్తరణ, భద్రతను మెరుగుపరిచే ప్రయత్నాల కారణంగా అధిక సంఖ్యలో సిబ్బంది అవసరమయ్యారని, ఇది ఖర్చులను పెంచిందని అధికారులు తెలిపారు.
మానవ వనరుల ఖర్చు పెరిగిన నేపథ్యంలోనే కార్గో లోడింగ్, టికెట్ ధరలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద కార్గో-రవాణా రైల్వే నెట్‌వర్క్‌గా భారతీయ రైల్వే అవతరించిందని అధికారులు చెప్పారు.ఛార్జీల పెంపు స్వల్పంగా ఉండటంతో సాధారణ ప్రయాణికులపై పెద్దగా ప్రభావం ఉండదని రైల్వే భావిస్తోంది. అయితే రోజూ దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు మాత్రం నెలవారీగా కొంత అదనపు భారం పడే అవకాశం ఉంది.

More Stories
విలువ సృష్టించే దశకుమారుతున్న తయారీరంగం
రూ. 4వేల కోట్ల బకాయిలతో కర్ణాటక ఆర్టీసీ దివాలా!
సంక్షోభంలో భారత బియ్యం ఎగుమతులు