టీఎంసీ పరిరక్షణలోనేఅక్రమ చొరబాటుదారులు

టీఎంసీ పరిరక్షణలోనేఅక్రమ చొరబాటుదారులు
టీఎంసీ పరిరక్షణలోనే అక్రమ చొరబాటుదారులు ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అందుకనే వారిని గుర్తించే ప్రక్రియకు సంబంధించిన ఎస్‌ఐఆర్‌ (ఎస్ఐఆర్)ను టీఎంసీ వ్యతిరేకిస్తోందని, చొరబాటుదారులు బయటపడకుండా కాపాడేందుకే ఇలా చేస్తోందనిఆయన ఆరోపించారు.  నదియా జిల్లా తహెర్‌పుర్‌లో నిర్వహించిన బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఫోన్‌ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతికూల వాతావరణం వల్ల ర్యాలీకి హాజరుకాలేకపోయినందుకు క్షమాపణలు తెలిపారు. 
బిహార్‌ ఎన్నికల ఫలితాలు బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కొత్త ద్వారాలు తెరిచాయని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.  ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు సంకేతమని పేర్కొంటూ టీఎంసీ తనను, బీజేపీని ఎంతగా వ్యతిరేకించినా, బంగాల్ అభివృద్ధిని మాత్రం ఆపకూడదని హితవు చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర పురోగతిని అడ్డుకోవడం ప్రజలకు నష్టం కలిగించడమేనని ప్రధాని హెచ్చరించారు.
 
“పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం కోసం బీహార్ కూడా మార్గం సుగమం చేసింది. బీహార్ ప్రజలు ‘జంగిల్ రాజ్’ పాలనను ఏకగ్రీవంగా తిరస్కరించారు. 20 సంవత్సరాల తర్వాత కూడా, వారు బీజేపీ-ఎన్డీఏ కూటమికి గతంలో కంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్‌లోని ‘మహా జంగిల్ రాజ్’ను అంతం చేయాలి,” అని ప్రధాని మోదీ  తెలిపారు.

‘వాళ్లు బీజేపీని ఎంత గట్టిగానైనా వ్యతిరేకించనీయండి. కానీ పశ్చిమబెంగాల్ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో నాకయితే అర్థం కావడం లేదు. మీరు మోదీని వ్యతిరేకించండి, కానీ ప్రజల సంతోషాన్ని అడ్డుకోకండి. ప్రజల హక్కులను కాలరాయకండి. వారి కలలను చెల్లాచెదురు చేసే పాపానికి ఒడికట్టకండి. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వమని పశ్చిమబెంగాల్ ప్రజలకు ముకుళిత హస్తాలతో వేడుకుంటున్నాను’ అని మోదీ విజ్ఞప్తి చేశారు.

 
రాష్ట్రంలోని దూర ప్రాంతాలు ఇప్పటికీ వెనుకబాటుతో బాధపడుతున్నాయని చెబుతూ ఆ ప్రాంతాలకు ఆధునిక కనెక్టివిటీ అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రహదారులు, రైల్వేలు, డిజిటల్‌ మౌలిక వసతుల ద్వారా బంగాల్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.  రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి కావాలంటే డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అవసరమని ప్రధాని స్పష్టం చేశారు.
కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తేనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. టీఎంసీ పాలనను మహా జంగిల్‌రాజ్​గా అభివర్ణించిన ప్రధాని, రాష్ట్రంలో అవినీతి, బంధుప్రీతి, తృప్తిపరిచే రాజకీయాలే నడుస్తున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లో క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావం ‘టీఎంసీ దుర్పాలన నుండి విముక్తి పొందడమే’ అని పేర్కొంటూ, “రాష్ట్రంలోని వీధులు, సందులన్నీ ‘బతకాలి అంటే బీజేపీ కావాలి’ అనే నినాదాలతో మారుమోగిపోతున్నాయి” అని ప్రధాని తెలిపారు.