సంక్షోభంలో భారత బియ్యం ఎగుమతులు

సంక్షోభంలో భారత బియ్యం ఎగుమతులు

భారత బియ్యం ఎగుమతులు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. అమెరికా టారిఫ్‌లకు తోడు ఇరాన్‌ సంక్షోభం ప్రభావంతో ప్రస్తుత ఏడాది నవంబర్‌లో బియ్యం ఎగుమతులు 30 శాతం క్షీణించి 0.79 బిలియన్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే నెలలో 1.12 బిలియన్ల ఎగుమతులు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ కాలంలో ఎగుమతులు 7.3 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి.

గతేడాది కూడా ఇదే సమయంలో 7.29 బిలియన్లుగా నమోదయ్యాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25లో మొత్తంగా 12.47 బిలియన్‌ డాలర్లు విలువ చేసే 19.86 మిలియన్‌ టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా నిల్వలు పెరగడం, ప్రధాన ఉత్పత్తి దేశాలలో పంట దిగుబడి బలంగా ఉండటం వల్ల గతేడాది కంటే ఎగుమతుల్లో తగ్గుదల చోటు చేసుకుందని ఎగుమతిదారుల వర్గాలు పేర్కొన్నాయి. 

అమెరికా విధించిన అధిక సుంకాలు, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత బియ్యం ఎగుమతులను దెబ్బతీశాయి. ‘గత ఏడాది భౌగోళిక గర్షణల భయంతో పలు దేశాలు అధికంగా నిల్వ చేసుకున్నాయి. ఈ ఏడాది పరిస్థితి స్థిరపడినప్పటికీ ఎగుమతుల్లో మందగమనం ఏర్పడింది. భారత్‌ నుంచి వచ్చే బియ్యం దిగుమతులపై అమెరికా అధిక సుంకాలను విధించడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాస్మతీ బియ్యం ఎగుమతులపై ప్రభావం చూపింది.” అని రైస్‌ విల్లా గ్రూప్‌ సిఇఒ సూరజ్‌ అగర్వాల్‌ తెలిపారు. 

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇరాన్‌ రియాల్‌ విలువ 90,000 నుండి 1,31,000 కు భారీగా పడిపోవడం భారత బియ్యం ఎగుమతుల అవకాశాలపై ప్రభావం చూపిందని ఎగుమతిదారులు పేర్కొన్నారు. ఇరాన్‌ ప్రభుత్వం 0.18 మిలియన్‌ టన్నుల దిగుమతికి అనుమతులు ఇస్తామని ప్రకటించినప్పటికీ, అందులో పెద్దగా పురోగతి లేదని ఎగుమతిదారులు తెలిపారు.

భారత బాస్మతీ బియ్యం ఎగుమతులకు అతిపెద్ద గమ్యస్థానాలలో ఇరాన్‌ ఒక్కటి. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ వివాదం ముదిరిన నేపథ్యంలో రవాణాలో మందగమనం చోటు చేసుకుందని పంజాబ్‌ బాస్మతీ రైస్‌ మిల్లర్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రంజిత్‌ సింగ్‌ జోసన్‌ పేర్కొన్నారు. చెల్లింపుల జాప్యం గురించి భయపడుతున్నారన్నారు. 

బియ్యం సరఫరాలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. బియ్యం వాణిజ్యంలో భారత్‌ 35 శాతం నుండి 40 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. ఆసియా, మధ్యప్రాచ్యం, ఐరోపా, అమెరికా వ్యాప్తంగా 140 కంటే ఎక్కువ దేశాలకు భారత్‌ బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. పలు దేశాలలో పాకిస్తాన్‌, థాయిలాండ్‌ వంటి బియ్యం ఎగుమతి చేసే దేశాల నుండి భారత్‌ గట్టి పోటీని ఎదుర్కొంటోంది.