బిజెపికి గాంధీ స్ఫూర్తి, ఆయన `పంచ నిష్ఠ’ సూత్రాలతో వివశం

బిజెపికి గాంధీ స్ఫూర్తి, ఆయన `పంచ నిష్ఠ’ సూత్రాలతో వివశం
ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో వీబీ-జీ రామ్ జీ బిల్లు, 2025ను తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహాత్మా గాంధీ భారతీయ జనతా పార్టీకి (బీజేపీ)కి స్ఫూర్తి అని, తమ పార్టీ ఆయన ‘పంచ నిష్ఠల’ తత్వశాస్త్రాన్ని విశ్వసిస్తుందని స్పష్టం చేశారు. గ్రామాలే భారతదేశానికి ఆత్మ అని, వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మహాత్మా గాంధీ విశ్వసించారని చౌహాన్ పేర్కొన్నారు.
 
ఇండియా టీవీకి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చౌహాన్ మాట్లాడుతూ, వీబీ-జీ రామ్ జీ బిల్లు, 2025 గ్రామాల స్వయం సమృద్ధిని లక్ష్యంగా పెట్టుకుందని, మహాత్మా గాంధీ ఆశయాలను నెరవేరుస్తుందని తెలిపారు. జాతిపితను ప్రశంసిస్తూ, మహాత్మా గాంధీ కేవలం ఒక వ్యక్తి కాదని, ఒక భావన అని ఆయన పేర్కొన్నారు. 
 
“వీబీ-జీ రామ్ జీ బిల్లు, 2025 కేవలం మహాత్మా గాంధీ ఆశయాలను మాత్రమే వెల్లడి చేస్తుంది,” అని మధ్యప్రదేశ్‌లోని విదిశ లోక్‌సభ ఎంపీ తేల్చి చెప్పారు. ఎంజీఎన్ఆర్ఈజీఏలో చాలా లోపాలు ఉన్నందున, చాలా చర్చల తర్వాతే వీబీ-జీ రామ్ జీ బిల్లు, 2025ను తీసుకువచ్చామని ఆయన ఇండియా టీవీకి తెలిపారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వం జవహర్ రోజ్‌గార్ యోజన పేరును మార్చిందని, అయితే దాని అర్థం వారు మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను ‘అవమానించినట్లు’ కాదని చౌహాన్ వాదించారు.
 
“కాంగ్రెస్ మహాత్మా గాంధీ పేరును దుర్వినియోగం చేస్తోంది,” అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా అయిన చౌహాన్ ధ్వజమెత్తారు. “గతంలో ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు లేదు, కానీ వారు 2009లో దానిని చేర్చారు. కాంగ్రెస్ ఎప్పుడూ మహాత్మా గాంధీని గౌరవించలేదు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్‌ను రద్దు చేయాలని మహాత్మా గాంధీ కోరుకున్నారు… కాంగ్రెస్ ఆయన వారసత్వాన్ని నాశనం చేసింది. దేశ విభజన కూడా ఆయన వారసత్వాన్ని నాశనం చేయడమే” అని విమర్శించారు. 
 
కేంద్రం నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించడంపై ప్రశ్నించగా, కొన్ని పార్టీలు ఈ విషయాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. ఎంజీఎన్ఆర్ఈజీఏను భర్తీ చేయడంలో సమస్య ఏమిటని ఆలోచిస్తూ, శ్రీరాముడు దేశానికి ఆదర్శమని ఆయన పేర్కొన్నారు.
 
“ఈ పథకంలో శ్రీరాముడి పేరును ఉపయోగించడంలో సమస్య ఏమిటి? భారతదేశాన్ని రామరాజ్యంగా మార్చడం మహాత్మా గాంధీ కల కూడా,” అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. వీబీ-జీ రామ్ జీ బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించగా, నిధులు సక్రమంగా ఉపయోగించబడలేదని, చాలా అవినీతి జరిగిందని చౌహాన్ బదులిచ్చారు.
 
ఎంజీఎన్ఆర్ఈజీఏ  కింద కార్మికులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని కూడా ఆయన ఎత్తి చూపారు. ఈ పథకం అవినీతిని అంతం చేసి, మారుమూల ప్రాంతాలకు అభివృద్ధిని తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. “మేము 2014 నుండి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. మా బృందాలు పరిస్థితిని విశ్లేషించాయి, చాలా చర్చలు, సంప్రదింపుల తర్వాత ఈ బిల్లును తీసుకువచ్చాము,” అని పేర్కొంటూ ఈ  బిల్లుపై చర్చ సందర్భంగా పార్లమెంటులో గొడవ చేసినందుకు ప్రతిపక్షాలను ఆయన విమర్శించారు.