శబరిమల బంగారు చోరీ కేసులో దర్యాప్తుకు కొల్లం విజిలెన్స్ కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అనుమతి ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను ఈడీకి అప్పగించాలని కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఆదేశించింది. ఇప్పటివరకు నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్ కాపీలు, నిందితులకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులు సహా ఇతర కీలక దస్త్రాలను ఈడీకి తక్షణమే ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ కేసులో రహస్య విచారణ జరుగుతోందని, ఈ దశలో డాక్యుమెంట్లు ఇవ్వడం సరికాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించినప్పటికీ కొల్లాం కోర్టు ఆ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ కేసును తమకు అప్పగించాలని ఇదివరకు ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే విజిలెన్స్ కోర్టులో పిటిషన్ వేయాలని ఈడీకి హైకోర్టు సూచించింది. ఈ క్రమంలో ఈడీ విజిలెన్స్ కోర్టును ఆశ్రయించగా, విచారణకు అనుమతి ఇచ్చింది.
రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ఐజీ నేతృత్వంలోని సిట్ బృందం చేస్తున్న విచారణలో పురోగతి లేదని, ఉన్నత స్థాయి వ్యక్తులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు వస్తున్న తరుణంలో ఈడీ రంగంలోకి రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో ఈడీ త్వరలో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదుచేయనుందని తెలిసింది.
శబరిమల ఆలయంలోని దేవుడి విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసంపై దర్యాప్తు చేపట్టేందుకు కేరళ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా సిట్ ఏడుగురిని అరెస్టు చేసింది. అయితే మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ ఈడీ తొలుత కేరళ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సూచన మేరకు కొల్లాం విజిలెన్స్ కోర్టులో పిటిషన్ వేయగా, ఈడీ విజ్ఞప్తిని సిట్ వ్యతిరేకించింది. ఒకేసారి రెండూ కొనసాగడం దర్యాప్తును ప్రభావితం చేస్తాయని అభిప్రాయపడింది. సిబ్ వాదనలను తిరస్కరించిన కొల్లాం విజిలెన్స్ కోర్టు, ఈడీ విచారణకు అనుమతిచ్చింది.

More Stories
రూ. 4వేల కోట్ల బకాయిలతో కర్ణాటక ఆర్టీసీ దివాలా!
సంక్షోభంలో భారత బియ్యం ఎగుమతులు
అధిక లగేజీకి అదనపు రైల్వే చార్జీ