బీజేపీలో చేరిన సినీ నటి ఆమని

బీజేపీలో చేరిన సినీ నటి ఆమని

ప్రముఖ సినీ నటి ఆమని శనివారం బీజేపీలో చేరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల సమక్షంలో పార్టీలో చేరగా, ఈ సందర్భంగా రాంచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా స్వాగతించారు. అదేవిధంగా ఆమె సహచరురాలు, ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్, నంది అవార్డు గ్రహీత శోభలత కూడా ఈ సందర్భంగా బీజేపీలో చేరారు.

శోభలత సినీ ఇండస్ట్రీలో మహిళా మేకప్ ఆర్టిస్టులకు మార్గదర్శకులు అని కొనియాడారు. సినీరంగంలో మహిళలకు మేకప్ ఉమెన్‌గా పనిచేసే అవకాశం లేకపోయిన సమయంలో, ఆమె కోర్టును ఆశ్రయించి ప్రత్యక్షంగా న్యాయపోరాటం చేశారని తెలిపారు. ఆమె పోరాటం ఫలితంగా సినీ ఇండస్ట్రీలో మహిళలు మేకప్ ఆర్టిస్టులుగా పనిచేయవచ్చనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు

ఆమని తన ప్రతిభ, వైవిధ్యం, గౌరవప్రదమైన తెరపై ఉనికితో తెలుగు సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ భారతీయ నటి అని ఆయన ప్రశంసించారు.  1992లో విడుదలైన జంబలకిడి పంబ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టి, ఆ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఆమెను ఇంటింటా తెలిసిన పేరుగా నిలిపిందని చెప్పారు.

ఆమని తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలలో ప్రముఖ నటులతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల మనసుల్లో విశేషమైన స్థానం సంపాదించారని చెప్పారు. అదేవిధంగా వివిధ టీవీ సీరియల్స్ లోనూ నటిస్తున్నారని పేర్కొంటూ  దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి సుపరిపాలనతో ఆకర్షితులై తాము కూడా దేశానికి సేవ చేయాలనే భావనతో వీరిద్దరూ బిజెపిలో చేరారని రామచంద్రరావు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నుంచి సుమారు వెయ్యి మంది సర్పంచులు, 1200 మందికి పైగా ఉపసర్పంచులు, అలాగే పదివేల మందికి పైగా వార్డు మెంబర్లు ప్రజల మద్దతుతో గెలుపొందారని ఆయన వెల్లడించారు. గెలిచిన ప్రజాప్రతినిధుల్లో కొంతమందిని అధికార కాంగ్రెస్ పార్టీ బెదిరించే ప్రయత్నాలు చేసినా, తాము బీజేపీలోనే కొనసాగుతామని సర్పంచులు స్పష్టంగా తేల్చి చెప్పారని అంటూ వారిని ఆయన అభినందించారు.

గతంలో బీజేపీ నగరాలకు మాత్రమే పరిమితమైందని విమర్శించిన వారి కళ్లు తెరుచుకునేలా, గ్రామీణ ప్రాంతాల్లోనూ బీజేపీ బలం పెరుగుతోందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు.  ప్రత్యేకించి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైన మహేశ్వరం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో వందలాది మంది బీజేపీ సర్పంచులు గెలుపొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమని మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టానని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడుతూ ఎన్నో మంచి పనులు చేస్తున్నారని, భారతీయులమని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అని ఆమె చెప్పారు. మోదీ అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నానని చెబుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం కూడా మోదీ కృషి చేస్తున్నారు అని ఆమె వ్యాఖ్యానించారు.