హెచ్‌-1బీ వీసా ఇంటర్వ్యూలు 2026 అక్టోబర్‌కు వాయిదా

హెచ్‌-1బీ వీసా ఇంటర్వ్యూలు 2026 అక్టోబర్‌కు వాయిదా
అమెరికా వీసా సంక్షోభం మరింత అధ్వానంగా మారింది. హెచ్‌-1బీ వీసా ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది అక్టోబర్‌కు వాయిదా పడడంతో వందలాది భారతీయుల అమెరికా ఉద్యోగాలు గాలిలో దీపంలా మారాయి. అమెరికాలో తమ కుటుంబాలను వదిలి భారత్‌కు వచ్చిన వేలాది మంది భారతీయులు దాదాపు మరో ఏడాదిపాటు తమ ఉద్యోగాలను ఎలా కాపాడుకోవాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. 
 
సోషల్‌ మీడియా ఖాతాల తనిఖీ పేరిట హెచ్‌-1బీ వీసా ఇంటర్వ్యూలను ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది మార్చికి తొలుత వాయిదా వేసిన భారత్‌లోని అమెరికన్‌ ఎంబసీలు ఇప్పుడు వచ్చే అక్టోబర్‌ వరకు వాయిదాను పొడిగించాయి. హెచ్-1బీ, హెచ్‌-4 వీసా ఇంటర్వ్యూల కోసం ఎదురుచూస్తున్న వందలాది భారతీయ దరఖాస్తుదారులు తమ అపాయింట్‌మెంట్లు 2026 అక్టోబర్‌కు వాయిదా పడడంతో అనిశ్చితిలో చిక్కుకున్నారు. 
 
వీసా దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా ఖాతాల తనిఖీ విస్తరణ కారణంగా మరింత సమయం పట్టే అవకాశం ఉందని, అందుకే వీసా ఇంటర్వ్యూలను అక్టోబర్‌ వరకు వాయిదా వేయడం జరిగిందని అమెరికన్‌ కాన్సులేట్స్‌ తెలిపాయి. తమ కుటుంబాలను వదిలి వీసా స్టాంపింగ్‌ ఇంటర్వ్యూ కోసం వచ్చిన వందలాది మంది హెచ్‌-1బీ ఉద్యోగులు తమ ప్రయాణాలు పలుసార్లు రద్దు కావడం, తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
 
వనరుల లభ్యతకు అనుగుణంగా అపాయింట్‌మెంట్ల మార్పు జరుగుతుంటుందని, ఎటువంటి మార్పులు జరిగినా దరఖాస్తుదారులకు నేరుగా సమాచారం అందచేయడం జరుగుతుందని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికార ప్రతినిధి తెలిపారు.కాగా, అపాయింట్‌మెంట్ల వాయిదాపై తక్షణ చట్టపరమైన చర్యలు చాలా పరిమితంగా ఉన్నప్పటికీ కంపెనీ నుంచి రిమోట్‌ వర్క్‌ లేదా సెలవు కోరడం ఒక్కటే దరఖాస్తుదారులకు ఉన్న మెరుగైన ప్రత్యామ్నాయమని నిపుణులు సూచించారు. ఇంటర్వ్యూల రద్దుపై నేరుగా చట్టపరమైన చర్యలకు దిగడం చాలా క్లిష్టమని, ఉద్యోగం పోవడం లేదా తర్వాతి కాలంలో ఎదురయ్యే వీసా సమస్యలను నివారించడానికి ప్రతి పరిణామానికి సంబంధించిన డాక్యుమెంట్లు తమ వద్ద ఉంచుకోవాలని సూచిస్తున్నారు. 

శాశ్వత నివాసానికి అమెరికా ఇక సురక్షితమేనా అన్న ప్రశ్న కూడా పలువురిలో ఉత్పన్నమవుతున్నది. అమెరికాను సందర్శించే విదేశీయులు ఆ దేశంలో ఎంత కాలం ఉండవచ్చునో నిర్ణయించే అధికారం కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌కే ఉంటుందని భారత్‌లోని యూఎస్‌ ఎంబసీ మరోసారి స్పష్టం చేసింది. అమెరికాలో సందర్శకులు ఉండటానికి తుది గడువు వీసా ముగింపు తేదీ కాదని వివరించింది.