పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. డిసెంబర్ 1న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 19 రోజుల తర్వాత శుక్రవారంతో ముగిశాయి. మొత్తం 15 రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలు పనిచేశాయి. శుక్రవారం లోక్​సభలో సభ్యులు జాతీయ గీతం ఆలపించిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. 

చివరి రోజున ఢిల్లీ కాలుష్యం గురించి చర్చ జరగాల్సి ఉండగా, ఎటువంటి చర్చ లేకుండానే సమావేశాలను వాయిదా వేశారు. అటు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల తర్వాత రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇరు సభలు నిరవధిక వాయిదా పడడంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి.

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్​సభ ఉత్పాదకత 111 శాతంగా ఉండగా, రాజ్యసభ ఉత్పాదకత 121 శాతం ఉంది. సభ సజావుగా జరిగేందుకు లోక్​సభ సభ్యులందరూ సహకరించారని చెబుతూ సహకరించిన ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగింపు సందర్భంగా పార్లమెంటు హౌస్​లోని తన చాంబర్‌లో లోక్‌ సభలోని పార్టీల నాయకులు, ఎంపీలతో స్పీకర్ ఓం బిర్లా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ సైతం పాల్గొన్నారు.

రాజ్యసభ వాయిదాకు ముందు సభను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రసంగిస్తూ తనకు సహకరించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రోత్సాహాన్ని గొప్ప ప్రేరణకు మూలంగా అభివర్ణించారు.  చర్చల సందర్భంగా సభ ఆలస్యమైనా వేచి ఉన్నారని, భోజన విరామాన్ని కూడా దాటవేయడానికి అంగీకరించారని ప్రశంసించారు. 

ఈ సెషన్‌ లో భారీ సంఖ్యలో జీరో అవర్ నోటీసులు వచ్చాయని తెలిపారు. సగటున రోజుకు 84 కంటే ఎక్కువ జీరో అవర్ నోటీసులు వచ్చాయని స్పష్టం చేశారు. ఈ నోటీసులు మునుపటి సెషన్లతో పోలిస్తే 31శాతం పెరిగాయని గుర్తు చేశారు. అయితే ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం నుంచే వాడీవేడీగా జరిగాయి. ఇండిగో సంక్షోభం, ఎస్ఐఆర్, ఎన్నికల సంస్కరణలు వంటి అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సమయంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.

ఈ సెషన్ లో మొత్తం 59 బిల్లులను ప్రవేశపెట్టారు.  ఎనిమిది బిల్లులను పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. అందులో ఎంజీనరేగా స్థానంలో తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ బిల్లు, పౌర అణు రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించే బిల్లులు, బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచే బీమా సవరణ బిల్లు సహా మరికొన్ని ఉన్నాయి.