మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అసమంజసమని, ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో వ్యక్తమైన నిరసనగళాన్ని గవర్నర్‌కు వినిపించామని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి చేపట్టిన కోటి సంతకాల పత్రాలను గురువారం సాయంత్రం లోక్‌భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందించారు.
అంతకుముందు జిల్లాల నుండి వచ్చిన సంతకాల పత్రాలతో కూడిన లారీలను గవర్నర్ కార్యాలయ కార్యాలయ అధికారులు పరిశీలించారు. అనంరతం లోక్‌భవన్ బయట జగన్ మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఇది అరుదైన ప్రజా ఉద్యమం అని చెప్పారు. పిపిపి అనేది పెద్ద కుంభకోణమని, ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి మరలా ప్రభుత్వమే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి వ్యతిరేకంగా కోర్టునూ ఆశ్రయిస్తామని, పిపిపికి వ్యతిరేకంగా పోరాడుతామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ఉరుకోబోమని హెచ్చరించారు. ప్రజలకు అందాల్సిన ఉచిత వైద్యం హక్కును కాపాడుకునేందుకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఏటా రూ.1000 కోట్లు వెచ్చిస్తే ఐదేళ్లలో మొత్తం కళాశాలలు పూర్తి చేయొచ్చని, ఆ పనిచేయడం లేదని తెలిపారు.
భవిష్యత్‌తరాలపై ప్రభావం చూపేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అందుబాటులో ఉండాలనే ప్రభుత్వ పాఠశాలలు నడుపుతున్నారని, బస్సులూ అంతేనని, మరి వైద్యం ఎందుకు దూరం చేస్తున్నారని జగన్ ప్రశ్నించారు. ఇలా అన్ని ప్రైవేటీకరిస్తూ పోతే దోపిడీకి చెక్‌పడదని, ప్రజలు సవలు పొందాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని మండిపడ్డారు.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్‌గా చేరాలంటే కనీసం రూ.5 వేలు వసూలు చేస్తారని, కనీస వసతులతో రూమ్ కావాలంటే రూ.10వేలు, ఐసియులో రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అందువల్లే ప్రభుత్వ రంగంలో వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తుంటే వాటిని కూటమి ప్రభుత్వం మరలా ప్రైవేటు వ్యక్తులకే అప్పజెబుతోందని జగన్ విస్మయం వ్యక్తం చేశారు.
ఒక్కో మెడికల్ కళాశాలలో సిబ్బందికి రెండేళ్లకు రూ.120 కోట్లు జీతాలకు ఖర్చవుతుందని, పదిమందికి రూ.1200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంటూ ఇదో భారీ కుంభకోణమని ఆరోపించారు. రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఐదువేల కోట్లు ఖర్చు చేయలేదా? అని ప్రశ్నించారు. వాటిని పూర్తి చేస్తే వైసిపికి క్రెడిట్ వస్తుందన్న అక్కసుతో ముఖ్యమంత్ర వాటిని పిపిపికి అప్పగించారని ధ్వజమెత్తారు.

More Stories
`అన్వేష్’ ఉపగ్రహం రేపే నింగిలోకి ప్రయోగం
ఇంద్రకీలాద్రిపై ‘శ్రీ చక్ర అర్చన’లో పురుగులు ఉన్న పాలు!
పరకామణిలో చోరీ కేసుబలహీనపర్చారు