సింధు జలాలపై భారత్ తీసుకున్న కఠిన నిర్ణయంతో ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌కు ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్ నుంచి మరో షాక్ తగిలింది. కునార్ నదిపై భారీ నీటి మళ్లింపు ప్రాజెక్టుకు తాలిబాన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం అమలైతే పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతానికి తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ పహల్గాం దాడికి ప్రతిస్పందనగా సింధు జలాలపై పరిమితులు విధించడంతో పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం మరింత తీవ్రమైంది.
ఈ నేపథ్యంలో ఆఫ్ఘానిస్తాన్ కూడా కునార్ నది నీటిని తన అవసరాల కోసం వినియోగించుకునే దిశగా అడుగులు వేయడం పాక్‌కు డబుల్ షాక్‌గా మారింది. కునార్ నది నుంచి నంగర్ హార్ ప్రావిన్స్‌లోని దారుంతా డ్యామ్‌కు నీటిని మళ్లించే ప్రతిపాదనకు తాలిబాన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుపై తుది నిర్ణయం కోసం ఆర్థిక కమిషన్‌కు ఫైల్ పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆఫ్ఘానిస్తాన్‌లోని నంగర్ హార్ ప్రాంతంలో వ్యవసాయ భూములకు నీటి కొరత తీరనుంది.
కానీ అదే సమయంలో పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో వ్యవసాయం, తాగునీరు, జలవిద్యుత్ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముంది. సుమారు 500 కిలోమీటర్ల పొడవున ప్రవహించే కునార్ నది, పాకిస్తాన్‌లోని ప్రధాన నదుల్లో ఒకటి. ఈ నది నీటిపై ఆధారపడి వేలాది రైతులు జీవిస్తున్నారు. కునార్ నది హిందూకుష్ పర్వతాల నుంచి ప్రారంభమై ఆఫ్ఘానిస్తాన్‌లోని కునార్, నంగర్ హార్ ప్రావిన్సుల గుండా ప్రవహించి కాబూల్ నదిలో కలుస్తుంది.
అక్కడి నుంచి పాక్‌లోకి ప్రవేశించి చివరకు సింధు నదిలో కలిసిపోతుంది. ఈ నది పాక్‌లోకి ప్రవేశించే ముందు ఆనకట్టలు నిర్మిస్తే పాకిస్తాన్‌కు నీటి సరఫరా తీవ్రంగా తగ్గిపోతుంది. ఈ నదిపై ఆఫ్ఘానిస్తాన్‌తో పాకిస్తాన్‌కు ఎలాంటి నీటి ఒప్పందాలు లేవు కావడంతో, తాలిబాన్ నిర్ణయాన్ని అడ్డుకునే అవకాశం పాక్‌కు లేదు. కునార్ నదిపై డ్యామ్ నిర్మాణానికి తాలిబాన్ అధినేత హిబతుల్లా అఖుంద్‌జాదా ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.
ఈ ప్రయత్నాలకు భారత్ మద్దతు ప్రకటించింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి పర్యటన సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, జల విద్యుత్ ప్రాజెక్టులు సహా స్థిరమైన నీటి నిర్వహణకు ఆఫ్ఘానిస్తాన్ చేపడుతున్న చర్యలకు భారత్ అండగా ఉంటుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గతంలోనూ భారత్ ఆఫ్ఘానిస్తాన్‌లో పలు డ్యామ్‌ల నిర్మాణానికి సహకరించింది. హెరాత్ ప్రావిన్స్‌లోని సల్మా ఆనకట్ట ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.

More Stories
భారత్ – ఒమన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
బంగ్లాలో మరో రెండు భారత వీసా కేంద్రాలు మూసివేత
దాడి యత్నంతో ఢాకాలో వీసా కార్యాలయం మూసివేత